ఇదీ జరుగుతోంది!

7 Mar, 2019 04:04 IST|Sakshi
డేటా చోరీ ఎలా జరిగిందనే దానిని వివరిస్తూ అంజనీకుమార్‌ రూపొందించిన గ్రాఫ్‌ ఇదే

ఐటీ గ్రిడ్స్‌ కేంద్రంగా సాగుతున్న కుట్రలు

పార్టీలో ‘కీ’పర్సన్స్‌గా పిలిచే వారిదే ముఖ్యపాత్ర

బూత్‌ స్థాయి టీడీపీ నేతలకూ భాగస్వామ్యం

ఓటర్ల ప్రమేయం లేకుండానే ఓట్లు గల్లంతు: సీపీ అంజన్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంలో ‘టీడీపీ కీ–పర్సన్‌’ అనే కోడ్‌తో పిలిచే వారు కీలకంగా వ్యవహరించారని హైదరాబాద్‌ పోలీసులు గుర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ ‘కీ’పర్సన్స్‌ ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ఈ యాప్‌ వ్యవహారంలో ఆన్‌లైన్‌లో జరిగే కీలక పరిణామాలను ఆయన మ్యాప్‌ రూపంలో వివరించారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!)

  • సేవామిత్ర యాప్‌ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్‌ సంస్థ.. వివిధ మార్గాల్లో ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటా సంగ్రహించింది.
  • దీని ఆధారంగా ఇక్కడి కాల్‌ సెంటర్లోని వాళ్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సర్వేయర్లు ముందుగా రూపొందించుకున్న ప్రశ్నావళి ప్రకారం ఓటర్ల అభిప్రాయాలు సేకరిస్తారు.
  • వారు చెప్పే అంశాలను పొందుపరుస్తూ.. ఆ వివరాలను సేవామిత్ర సైట్‌కు అప్‌లోడ్‌ చేస్తారు.
  • ఈ డేటాను ఐటీ గ్రిడ్స్‌ సంస్థ ఓ క్రమపద్ధతిలో ఏర్పాటు చేస్తుంది.
  • దీన్ని నియోజకవర్గాల్లోని బూత్‌ స్థాయి సేవామిత్ర కన్వీనర్లకు అనువుగా తయారు చేసి వారికి పంపిస్తుంది.
  • క్షేత్రస్థాయిలో సర్వే చేస్తూ అందులోని ఓటర్ల వివరాలను సరిచూసే ఈ బూత్‌ స్థాయి కన్వీనర్లు వారి ఆధార్, మొబైల్‌ నంబర్లు, కులం, రాజకీయ ప్రాధాన్యం వివరాలు సేకరిస్తారు.
  • ఇలా రూపొందించిన డేటాను మళ్లీ హైదరాబాద్‌లోని అయ్యప్పసొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు పంపిస్తారు.
  • ఈ డేటాను మరికొన్ని కోణాల్లో విశ్లేషించే ఐటీ గ్రిడ్స్‌ సంస్థ టీడీపీ వ్యతిరేక ఓటర్లు, ఆయా ప్రాంతాల్లో లేని వారిని గుర్తిస్తుంది. ఇలా సమగ్ర విశ్లేషణతో తయారు చేసిన జాబితాలను తెలుగుదేశం పార్టీ ‘కీ’పర్సన్‌కు పంపిస్తుంది. సదరు యాప్‌లో వీరికి ‘టీడీపీ కీ–పర్సన్‌’అనే కోడ్‌ వర్డ్‌ ఇచ్చారు.
  • ఆ కీపర్సన్‌ తనకు అందిన ఫైనల్‌ జాబితాలోని ఓటర్లు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాదని నిర్ధారించుకుంటాడు.
  • వారి పేరుతో తప్పుడు మార్గంలో ఫామ్‌–7 రూపొందించి ఓట్లు తొలగించేందుకు ఓటర్‌ ప్రమేయం లేకుండానే సంబంధిత అధికారికి పంపించేస్తారు.
  • సేవామిత్ర సర్వేలో వేరే పార్టీకి ప్రాధాన్యం ఇచ్చిన వారు తమకు ఓటు వేయరనే ఉద్దేశంతో తొలగించేస్తున్నారు. సర్వే సమయంలో అందుబాటులో లేని వాళ్లు.. పోలింగ్‌ సమయంలో వచ్చి వేరే పార్టీకి ఓటు వేస్తారనే ఉద్దేశంతో తీయించేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. (‘ఐటీ గ్రిడ్స్‌’పై సిట్‌)

మరిన్ని వార్తలు