అప్పిచ్చి అంతా దోచుకున్నారు!

31 Jan, 2018 12:18 IST|Sakshi
వ్యాపారి ఇంటి వద్ద కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు

కందుకూరులో మరో కాల్‌మనీ కహానీ

రూ. 7 లక్షలకు వడ్డీ కూడా తీసుకుని మళ్లీ రూ.12 లక్షలు స్వాహా

వ్యాపారి ఇంటిముందు ధర్నాకు దిగిన బాధితులు

కందుకూరు అర్బన్‌: కందుకూరు పట్టణంలో కాల్‌మనీ కేటుగాళ్లు మరోసారి బుసలు కొట్టారు. కోటకట్ట వీధికి చెందిన భార్యాభర్తలు ఓ వడ్డీ వ్యాపారి వద్ద తమ ఇంటిని తాకట్టుపెట్టి రూ. 7 లక్షలు వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా అప్పు తీరకపోవడంతో ఇంటిని బ్యాంకులో తాకట్ట పెట్టి రూ. 12 లక్షలు రుణం తీసుకున్నారు. కానీ కాల్‌మనీ వ్యాపారులు రంగంలోకి దిగారు. ప్రతి నెలా వడ్డీ దిగమింగుతోంది చాలక.. బ్యాంకు నుంచి వచ్చిన సొమ్మంతా దిగమింగారు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే  మీకు దిక్కున్నచోట చెప్పుకొమ్మని గెంటివేశారు. దీందో బాధితులు వడ్డీ వ్యాపారి ఇంటిముందు మంగళవారం ఆందోళనకు దిగారు. వివరాలు.. మున్సిపాలిటీలోని 6వ వార్డు కోటకట్ట వీధికి చెందిన షాజహాన్, కరీమ భార్యాభర్తలు. ఈ నేపథ్యంలో పామూరు రోడ్డులోని ఉన్న ఎం. మాల్యాద్రి, ఆయన కుమారుడు నరసింహారావుకు సంబంధించిన స్థలాన్ని టిఫిన్‌ హోటల్‌ కోసం అద్దెకు తీసుకున్నారు.

వీరికి డబ్బులు అవసరం కావడంతో తన ఇంటిని నరసింహారావుకు తాకట్టు పెట్టి రూ. 7లక్షలు 2016లో అప్పుగా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి రోజూ రూ. 700 చొప్పున నెలకు 21వెయ్యి వడ్డీ కడుతున్నారు. అయితే రెండు  సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బులు మొత్తం వడ్డీ కట్టడానికే సరిపోకపోవడంతో బ్యాంకు నుంచి లోను తీసుకొని బాకీ డబ్బులు కట్టాలని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పట్టణంలోని ఒక ప్రైవేటు బ్యాంకును సంప్రదించగా  లోను ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. విషయాన్ని వడ్డీ వ్యాపారి నరసింహారావు దృష్టికి తీసుకొని వెళ్లారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం బ్యాంకు నుంచి రూ. 12 లక్షల లోను తీసుకున్నారు. అయితే షాజహన్, కరీమ నరసింహారవు దగ్గర రూ. 7 లక్షలు  తీసుకున్న సమయంలో వ్యాపారి పేరుపై ఇంటికి సంబంధించిన పత్రాలను బదిలీ చేశారు. దాంతో బ్యాంకు అధికారులు రూ. 12 లక్షల చెక్కును నరసింహారావుకు అందజేశారు.

అడ్డం తిరిగాడు..
 చెక్కును మార్చుకొని అప్పుగా ఇచ్చిన రూ. 7 లక్షల నగదును తీసుకొని మిగిలిన డబ్బులు ఇవ్వాలని ఆయన ఇంటికి వెళ్లి కోరగా.. మీరే మాకు డబ్బులు ఇవ్వాలని బూతులు తిడుతూ రోడ్డు మీదకు నెట్టడంతో ఇంటి ముందు ఆందోళనకు దిగామని కరీమ, ఆమె బంధువులు తెలిపారు. ప్రతినెలా వడ్డీ కట్టిన రసీదులు కూడా ఉన్నాయని, తమకు రావలసిన నగదును ఇవ్వాలని కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అసభ్యకరమైన పదజాలంతో తిడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్సై వేమన సంఘటన స్థలానికి చేరుకొని సదరు వ్యక్తిపై ఫిర్యాదు ఇస్తే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై  పట్టణ ఎస్సై వేమనను వివరణ కోరగా ఇది సివిల్‌ సమస్య ఇంకా కేసు నమోదు చేయలేదని తెలిపారు. నరసింహారావు మాట్లాడుతూ2015లో షాజహాన్‌ అనే వ్యక్తి నా దగ్గర రూ. 5 లక్షలు వడ్డీకి తీసుకున్నాడని  అసలు, వడ్డీ ఇవ్వాలేదన్నారు. యతేంద్ర అనే వ్యక్తి అప్పు కోసం ఒత్తిడి తేవడంతో నా చేత రూ. 7 లక్షలు కట్టించి అతని ద్వారా నాకు ఇంటి పత్రాలు తనఖా పెట్టించారన్నారు. ప్రైవేటు బ్యాంకు వారు సుమారు 11.79 లక్షలు  చెక్కును ఇవ్వగా నా అకౌంటుకి జమచేసుకున్నాని చెప్పారు.

మరిన్ని వార్తలు