తప్పుడు పేర్లు చెప్పిన వారిపై మరో కేసు! 

14 Jan, 2020 05:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బందరు రోడ్డులో అనుమతి లేకున్నా ర్యాలీ చేసిన టీడీపీ మహిళా కార్యకర్తలు

అరెస్టు చేసిన పోలీసులు

పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు పేర్లు, చిరునామా ఇచ్చిన వైనం

సాక్షి, అమరావతి బ్యూరో: అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు పేర్లు, చిరునామాలు ఇచ్చిన వారిని గుర్తించే పనిలో విజయవాడ పోలీసులు పడ్డారు. వారిపై సెక్షన్‌ 42 సీఆర్‌పీసీ ప్రకారం మరో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గత శుక్రవారం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో టీడీపీ మహిళా కార్యకర్తలు విజయవాడ బందరు రోడ్డులో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. నగరంలో 144 సీఆర్‌పీసీ, సెక్షన్‌ 30 యాక్ట్‌ అమలులో ఉందని చెప్పినా వినకుండా గుంపులుగుంపులుగా కలసి వచ్చారు. చట్టాలను ఉల్లంఘించారు. ట్రాఫిక్‌కు అవాంతరం కలిగించారు. పోలీసులపై దౌర్జన్యం చేశారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారు.

చివరకు వారి వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో రోడ్డుపై బైఠాయించిన మహిళల్ని అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఐపీసీ 143, 188, 341, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అందరి వివరాలు అడగ్గానే ఆక్రోశంతో ఊగిపోయారు. కొందరు మహిళలు తమ పేర్లు, చిరునామాలు చెప్పేందుకు నిరాకరించారు. మరికొందరు నాపేరు జయసుధ, జయప్రద అంటూ.. చివరకు సీఎం వైఎస్‌ జగన్‌ తల్లి, సోదరి, సతీమణి పేర్లు సైతం చెప్పారు. అలాగే తప్పుడు చిరునామాలు ఇచ్చారు. ఇలా చేసిన వారిని గుర్తించి మరో కేసు నమోదు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పోలీసులను ఆదేశించారు. 

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..  
చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ర్యాలీకి అనుమతి లేదన్నా వినకుండా గత శుక్రవారం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం నేరం. అందుకే 479 మందిపై కేసు నమోదు చేసి వారినందరినీ పోలీసుస్టేషన్లకు తరలించాం. సెక్షన్‌ 42 సీఆర్‌పీసీ ప్రకారం పోలీసు అధికారులు అడిగినప్పుడు ఎవరైనా తమ పేర్లు, చిరునామాలు పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కారు. కాదని మొండికేస్తే కోర్టులో ప్రవేశపెడతాం. 
– ద్వారకా తిరుమలరావు, సీపీ, విజయవాడ 

మరిన్ని వార్తలు