హైదరాబాద్‌లో మరోమారు డ్రగ్స్‌ కలకలం

18 Aug, 2018 16:07 IST|Sakshi
ప్రతికాత్మక చిత్రం

హైదరాబాద్‌: నగరంలో మరోమారు డ్రగ్స్‌ కలకలం రేగింది. డ్రగ్‌ టాబ్లెట్లు విక్రయిస్తోన్న రాజేష్‌ అనే వ్యక్తిని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీసీ ఎస్‌కే ఖురేషి విలేకరులతో మాట్లాడుతూ..కొత్తపేటకు చెందిన రాజేశ్‌ను నిన్న(శుక్రవారం) సాయంత్రం బిగ్‌బజార్‌ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిద్రపోవడానికి ఈ టాబ్లెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. 8 వేల రెండు వందల యాభై మత్తు మందు టాబ్లెట్లు సీజ్‌ చేసినట్లు తెలిపారు.

కర్ణాటక రాష్ర్టంలోని రాయచూర్‌ నుంచి టాబ్లెట్స్‌ తెచ్చి రాజేష్‌ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఆటోడ్రైవర్లు, చిన్న చిన్న పనిచేసుకునే కార్మికులు, కొంత మంది వ్యాపార వేత్తలకు టాబ్లెట్లు సరఫరా చేస్తున్నాడని వివరించారు. అందరూ కూడా ఇతనికి తెలిసిన కస్టమర్లేనని పేర్కొన్నారు. ఒక్కో టాబ్లెట్‌ను యాభై నుంచి వంద రూపాయలకు అమ్ముతున్నట్లు విచారణలో రాజేష్‌ తెలిపాడని చెప్పారు. 

మరిన్ని వార్తలు