జామియాలో మరోసారి కాల్పులు

3 Feb, 2020 12:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జామియా మిలియా యూనివర్సిటీలో ఆదివారం అర్ధరాత్రి మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. దీంతో కాసేపటివరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని విశ్వవిద్యాలయం ఎదుట విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసననలు వ్యక్తం చేస్తుండగా కొంతమంది దుండగులు స్కూటీపై వచ్చి కాల్పులకు పాల్పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. తొలుత గేట్‌ నంబర్‌ 5 దగ్గర, తర్వాత గేట్‌ నంబర్‌ 1 వద్ద వారు ఫైరింగ్‌ జరిపినట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

ఈ ఘటనపై జామియా యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు.. అధికారులకు సమాచారమిచ్చారు. ఓక్లా నుంచి వచ్చిన స్కూటీ జుల్లెనా వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. దుండగుల్లో ఒకరు రెడ్‌ జాకెట్‌ ధరించారని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా తమకు ఎలాంటి ఖాళీ బుల్లెట్లు దొరకలేదని తెలిపారు. దుండగులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. కాగా నాలుగు రోజుల వ్యవధిలో జామియా మిలియా యూనివర్సిటీ ప్రాంతంలో కాల్పులు జరగడం ఇది మూడోసారి.

చదవండి:

విద్యార్థులపై తూటా

కాల్పుల కలకలం.. అతడింకా పిల్లాడే.!

మరిన్ని వార్తలు