హనీట్రాప్‌ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు

7 Jun, 2020 05:13 IST|Sakshi

ఆపరేషన్‌ డాల్ఫిన్‌నోస్‌ దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఐఏ

ఇందులో 11 మంది నౌకాదళ సెయిలర్స్‌

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ సమాచారాన్ని శత్రుదేశం పాకిస్తాన్‌కు చేరవేస్తున్న హనీట్రాప్‌ కేసులో మరో కీలక సూత్రధారిని నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్ట్‌ చేశారు. సెయిలర్స్‌కి ఫండింగ్‌ చేసిన ముంబైకి చెందిన అబ్దుల్‌ రెహమాన్‌ అబ్దుల్‌ జబ్బర్‌ షేక్‌(53)ను అక్కడే పట్టుకున్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో తీవ్రంగా పరిగణించిన ఎన్‌ఐఏ ఆపరేషన్‌ డాల్ఫిన్‌నోస్‌ లో వెల్లడైన నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్‌లోనే 11 మంది ఇండియన్‌ సెయిలర్స్‌ను, ఆ తర్వాత మరో ముగ్గురు సూత్రధారులను అరెస్ట్‌ చేసింది. మొత్తంగా ఈ కేసులో 15మందిని అరెస్ట్‌ చేసింది. 

భార్యాభర్తలిద్దరూ..  
ఈ గూఢచర్యం కేసులో అబ్దుల్‌ భార్య షైష్టా ఖైజర్‌ని గతంలోనే అరెస్ట్‌ చేశారు. భార్యాభర్తలిద్దరూ పాక్‌లోని వ్యక్తుల సూచనల మేరకు సమాచారం అందించిన సెయిలర్స్‌ ఖాతాల్లోకి నగదుని బదిలీ చేస్తుండేవారు. దర్యాప్తులో ఈ విషయం తెలుసుకున్న ఎన్‌ఐఏ.. అబ్దుల్‌ని అరెస్టు చేసి 120బీ, 121ఏ, ఐపీసీ సెక్షన్‌ 17,18, సెక్షన్‌ 3 యాక్ట్‌(అఫీషియల్‌ సీక్రెట్‌ యాక్ట్‌) కింద కేసులు నమోదు చేసింది. డిజిటల్‌ డివైజ్‌లు, కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ప్రకటనలో తెలిపింది. 2018 అక్టోబర్‌ నుంచి పాకిస్తాన్‌కు ఈ సెయిలర్స్‌ సమాచారం ఇవ్వడం ప్రారంభించినట్లు పేర్కొంది. యుద్ధనౌకలు, సబ్‌మెరైన్‌ల సమాచారం ఎప్పటి నుంచి చేరవేశారు.. దాని వల్ల నౌకాదళానికి, దేశ భద్రతకు ఏ మేరకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనే కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది.

మరిన్ని వార్తలు