అమరావతిలో మరో నిర్భయ

25 Apr, 2018 01:37 IST|Sakshi

ఒంటరి మహిళపై పాశవిక అత్యాచారం    

కారంపూడి (మాచర్ల): రోజురోజుకూ కామాంధులు పేట్రేగిపోతున్నారు. మానవ మృగాల అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా గుంటూరు జిల్లా ఒప్పిచర్లలో భర్త ఆదరణకు దూరమై కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న ఒంటరి మహిళపై ఓ 17 ఏళ్ల యువకుడు అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె జననాంగంలో కర్రతో తిప్పి దారుణంగా హింసించాడు. ప్రస్తుతం ఆ మహిళ చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన బాధితురాలి(24)కి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెను చేరదీసి పెంచిన అమ్మమ్మ.. ఏడేళ్ల కిందట కారంపూడి మండలం ఒప్పిచర్లకు చెందిన యువకుడితో వివాహం చేసింది.

బాబు పుట్టిన కొన్నాళ్లకు ఆమెను మరీ అమాయకంగా ఉన్నావ్‌ అంటూ భర్త ఇంట్లో నుంచి కొట్టి తరిమేశాడు. భర్త, కుమారుడిపై మమకారం పెంచుకున్న ఆమె.. వారికి చేరువయ్యేందుకు ప్రయత్నించింది. అయినా కూడా భర్త దగ్గరకు రానివ్వకపోవడంతో అదే గ్రామంలోని గుడి, బడి వద్ద ఉంటూ కాలం వెళ్లదీసింది. దీంతో కొందరు మహిళలు ఆమెను గుంటూరులోని ఓ అనాథాశ్రమంలో చేర్పించారు. అక్కడ 8 నెలల పాటు ఉన్న ఆ మహిళ.. కొడుకును చూడకుండా ఉండలేక మళ్లీ ఒప్పిచర్లకు తిరిగి వచ్చింది. చిన్నపాటి రేకుల ఇల్లు అద్దెకు తీసుకుని కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి స్నానం చేసి దుస్తులు మార్చుకుంటున్న సమయంలో పొరుగునే నివసిస్తున్న షేక్‌ సైదులు ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు.

ఆమెపై దాడి చేసి.. నోట్లో గుడ్డలు కుక్కి.. చంపేస్తానని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఐదు గంటల వరకు అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడడంతో పాటు ఆమె జననాంగంలో కర్రతో తిప్పి దారుణంగా హింసించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. రక్తసిక్తమైన బట్టలతో బయటకు వచ్చిన ఆ మహిళ ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పింది. వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు.

సోమవారం రాత్రి అమ్మమ్మ సాయంతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఆ మహిళ జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గురజాల సీఐ నరసింహరావు, కారంపూడి ఎస్‌ఐ మురళి ఘటనాస్థలికి వెళ్లి.. ఇంటి నిండా ఉన్న రక్తపు మరకలతో పాటు రక్తంతో తడిసిన దుస్తులు, జననాంగంపై దాడికి ఉపయోగించిన వస్తువులను సేకరించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మంగళవారం ఆమెను గుంటూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడిని పోలీసులు తమ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు