టైరు ఊడి.. అదుపుతప్పి..

17 Sep, 2018 02:44 IST|Sakshi
పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సులోంచి బయటకు వస్తున్న ప్రయాణికులు

పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

నాగర్‌కర్నూల్‌ జిల్లా వట్టెం వద్ద ఘటన

11 మందికి తీవ్ర గాయాలు, 9 మంది నిమ్స్‌కు తరలింపు

డ్రైవర్‌ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం

బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు

క్షతగాత్రులందరూ వీఆర్వో అభ్యర్థులే

సాక్షి, బిజినేపల్లి రూరల్‌/హైదరాబాద్‌/నర్సాపూర్‌: కొండగట్టు బస్సు ప్రమాదం మరువక ముందే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. వట్టెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి పంట పొలాల్లోకి దూసుకెళ్ల డంతో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో 9మందిని నిమ్స్‌కు, మిగిలిన వారిని నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో అందరూ వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 100 మంది ఉన్నట్లు తెలిసింది.

బస్సు టాప్‌పై..
యాదగిరిగుట్ట డిపోకు చెందిన (ఏపీ 24జడ్‌ 0037) బస్సు ఆదివారం హైదరాబాద్‌ నుంచి వనపర్తి బయలుదేరింది. వీఆర్వో పరీక్ష ఉండటం, బస్సులో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో కొందరు బస్సు టాప్‌ పైకి ఎక్కారు. బిజినేపల్లి మండలం వట్టెం సమీపంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం వద్దకు బస్సు రాగానే ముందు టైరు పేలింది. దీంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ప్రయాణికులు కిక్కిరిసి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. బస్సు టాప్‌పై ఉన్న వారు కిందపడ్డారు. కిందపడిన వారిలో 11 మందికి తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐ శ్రీనివాస్‌రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న 100 మందిలో 65 మంది వీఆర్వో అభ్యర్థులే ఉన్నారు. చాలా కాలంగా పరీక్షకు సిద్ధమవుతున్నామని, పరీక్షకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి రాయలేకపోయామని అభ్యర్థులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా, నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరామర్శించారు. తక్షణ సహాయంగా కొంత నగదును బాధితుల బంధువులకు అందజేశారు.

క్షతగాత్రుల వివరాలు
మ«ధుకర్‌ (బైరాపూర్‌), భూపాల్‌ (బోడంపహాడ్‌), రాజు (బాలానగర్‌), అనిల్‌ (కొడంగల్‌) నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్‌ (మాడ్గుల), ప్రభాకరాచారి (హైదరాబాద్‌), రాంచందర్‌ (బాలానగర్‌), నాగమల్లయ్య (తెల్కపల్లి), జింకల శివకుమార్‌ (ఆలేరు), నర్సింహులు (పెద్దఅల్వాల్‌), కృష్ణ (వెల్జాల)ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించారు.

కలెక్టర్‌ చొరవతో పరీక్షకు..
పాన్‌గల్‌: ప్రమాదంలో గాయపడి ఆలస్యంగా కేంద్రానికి చేరుకున్న అభ్యర్థి కలెక్టర్‌ శ్వేతామహంతి చొరవతో పరీక్ష రాసేందుకు సిబ్బంది అనుమతించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ చెందిన పవన్‌ కల్యాణ్‌.. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. కానీ నాగర్‌కర్నూల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో పవన్‌ కూడా గాయపడ్డాడు. అయినా 11.28 నిమిషాలకు కేంద్రానికి చేరుకున్నాడు. కానీ ఆలస్యమవడంతో అధికారులు అనుమతించలేదు. విషయం కలెక్టర్‌కు తెలియడంతో పరీక్షకు అనుమతించారు. అప్పటికే పవన్‌ వెనుదిరిగినా పాన్‌గల్‌ ఎస్సై తిరుపాజీ హుటాహుటిన వెళ్లి వనపర్తి మండలం అంజనగిరి వద్ద బస్సును ఆపి పవన్‌ను తన వాహనంపై పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రత్యేక గదిలో 12.40కి పరీక్ష రాసేందుకు అనుమతించారు.

నర్సాపూర్‌లో మరో ప్రమాదం
నర్సాపూర్‌లో మరో బస్సు ప్రమాదం జరిగింది. బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని ఢీ కొట్టింది. సంగారెడ్డి డిపోకు చెందిన ఏపీ 28 జెడ్‌ 0480 నంబర్‌ బస్సు ఆదివారం సాయంత్రం సంగారెడ్డి నుంచి గజ్వేల్‌ బయలుదేరింది. నర్సాపూర్‌ పట్టణ శివారులోని బీవీఆర్‌టీ కాలేజీ దగ్గరకు రాగానే స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బస్సు బ్రేకులు పనిచేయకపోవడంతో లారీని వెనక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌ రాములు సహా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు నవ్య, మనోహర, బూదమ్మలను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవ్య, మనోహర సంగారెడ్డిలో వీఆర్వో పరీక్ష రాసి వస్తున్నట్లు చెప్పారు. ప్రమాద సమయంలో 60 మంది ప్రయాణికులున్నారని కండక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. కాలేజీ సమీపంలో ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బ్రేకులు పడకపోవడంతో ముందున్న లారీని ఢీ కొట్టిందని డ్రైవర్‌ తెలిపారు.
బస్సు ప్రమాదంలో గాయపడిన ‘వీఆర్వో’ అభ్యర్థులు

మరిన్ని వార్తలు