విలన్‌ కోనేరు కృష్ణనే!

4 Jul, 2019 01:34 IST|Sakshi
ట్రాక్టర్‌ డ్రైవర్‌ తిరుపతిపై దాడి చేస్తున్న కృష్ణ, ఆయన అనుచరులు

కాగజ్‌నగర్‌ ఘటనపై మరో వీడియో 

సాక్షి, ఆసిఫాబాద్‌: కాగజ్‌నగర్‌ మండలం సార్సాలలో అటవీ అధికారులపై జరిగిన దాడుల్లో బుధవారం మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ హల్‌చల్‌ సృష్టించినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో మొదటి నుంచి పకడ్బందీగా అన్నీ తానై వ్యవహరించారు. ఆ వీడియో ప్రకారం.. ఆదివారం ఉదయం సార్సాల గ్రామస్తులను వెంట బెట్టుకుని అటవీ అధికారుల వద్ద ఉన్న ట్రాక్టర్‌ యజమాని మేకల తిరుపతిపై దాడికి పాల్పడ్డాడు.

తిరుపతిని విచక్షణారహితంగా కర్రలతో కొట్టినట్లు కనిపిస్తోంది. తన ట్రాక్టర్‌ రాలేదని అతను ఎంత చెప్పినా వినకుండా దాడికి తెగబడ్డాడు. కాగజ్‌నగర్‌ టౌన్‌ సీఐ కిరణ్‌కుమార్‌ అటవీ అధికారులను అడ్డుకున్న వారందరినీ జీపులో ఎక్కించుకుని వెళ్లే క్రమంలో పోలీసులను బెదిరించి జీపులో ఉన్న వారిని కృష్ణ కిందకు దింపేశారు. అనంతరం ఎఫ్‌ఆర్వో అనితను దుర్భాషలాడారు. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెపై కర్రతో దాడి చేశారు. అనంతరం అక్కడ కనిపించిన వారిపై దాడి చేస్తూ వెళ్లారు. కృష్ణ సార్సాల గ్రామానికి రాకముందు అటవీ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చేటు చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన అండతో గ్రామస్తులు సైతం కర్రలు చేతబూని దాడులకు తెగబడ్డారు. 

పోలీసుల ప్రేక్షక పాత్ర 
ఈ దాడుల్లో పోలీసుల ప్రేక్షక పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. సీఐ కిరణ్‌కుమార్‌ జీపులో ఉన్న వారందరినీ దింపుతున్నా కృష్ణకు ఎదురు చెప్పకపోగా.. ఆయన దాడులను చూస్తూ ఉండిపోయారు.
 
31 మంది అరెస్టు  
అటవీ అధికారులపై దాడులు చేసిన వారిలో బుధవారం వరకు మొత్తం 38 మంది నిందితులను గుర్తించగా.. ఇందులో 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కోనేరు కృష్ణతో సహా వీరంతా ప్రస్తుతం ఆదిలాబాద్‌ జైలులో ఉన్నారు.

మరిన్ని వార్తలు