రణరంగంగా తూత్తుకుడి

22 May, 2018 18:07 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్‌) మళ్లీ రణరంగంగా మారింది. ఉదయం జరిగిన పరిణామాల తర్వాత కాసేపు శాంతించిన ఆందోళనకారులు మళ్లీ చెలరేగిపోయారు. ఎస్పీ క్యాంప్‌ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు కాల్పులకు దిగారు.  కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఆందోళనలో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీని మూసేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా, అది కాస్త హింసాత్మకంగా మారింది. 

ఉదయం నుంచి మొదలై... స్టెరిలైట్‌ కాపర్‌ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో గత వందరోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు చేసినా అన్నాడీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతోందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే  సుమారు 20 వేల మంది మంగళవారం కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరారు. అయితే వారిని మరోచోట ఆందోళన నిర్వహించుకోవాలంటూ పోలీసులు అడ్డుకున్నారు.  


ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. తొలుత పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ ఆందోళనకారులు విజృంభించటంతో కాల్పులు జరపగా 9 మంది మృతి చెందారు.

మరిన్ని వార్తలు