శ్రీధర్‌బాబుకు ముందస్తు బెయిల్‌

8 Nov, 2017 20:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు హైకోర్టులో ఊరట లభించింది. తెరాస నాయకుడి ఇంట్లో గంజాయి పెట్టించారన్న కేసులో బుధవారం ఆయనకు ఉన్నత న్యాయస్థానం  ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 

మంథని నియోజకవర్గంలో తెరాసకు చెందిన మాజీ సర్పంచి ఇంట్లో కాంగ్రెస్‌ నాయకుడి ద్వారా గంజాయి పెట్టించి ఆయనను కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారనే అభియోగంపై హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీధర్‌బాబుపై కేసు నమోదయ్యింది. వినాయకచవితి సమయంలో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద తనపై కేసు నమోదు చేయించేలా కుట్ర పన్నారని, ఇందుకు భార్గవ్‌ ద్వారా తన ఇంట్లో గంజాయి పెట్టించారని ముత్తారం మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో సుదర్శన్‌ను ఏ–1గా, శ్రీధర్‌బాబును ఏ–2గా, భార్గవ్‌ను ఏ–3గా చేర్చారు.

అయితే రాజకీయ కక్షతోనే తనపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు పెట్టారని, ముందస్తు బెయిల్‌ మంజూరుచేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.  ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం  శ్రీధర్‌బాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు