షాకింగ్‌ : కేంద్రమంత్రికి వేధింపులు

12 Jun, 2018 16:09 IST|Sakshi
అనుప్రియా పటేల్‌ (పాత ఫొటో)

లక్నో, ఉత్తరప్రదేశ్‌ : కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆమె సొంత నియోజకవర్గం మీర్జాపూర్‌కు వెళ్లిన ఆమెను కొందరు ఆకతాయిలు వేధించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మీర్జాపూర్‌లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనుప్రియ తిరిగివస్తున్న సమయంలో ముగ్గురు యువకులు కారులో ఆమె కాన్వాయ్‌ను ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించారు. అయినా పట్టించుకోని ఆకతాయిలు మంత్రి, సెక్యూరిటీ సిబ్బందిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు.

యువకుల ప్రయాణిస్తున్న కారుకు నెంబర్‌ ప్లేట్‌ లేదు. మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిలను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, మహిళల రక్షణ కోసం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఆశించిన స్థాయిలో ఈ స్క్వాడ్స్ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఏకంగా కేంద్రమంత్రిపైనే ఆకతాయిలు వేధింపులకు దిగడం యూపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు