టార్గెట్‌ ఆర్కే

19 May, 2018 12:40 IST|Sakshi

విశాఖ మన్యంతోపాటు

ఏవోబీని జల్లెడ పడుతున్న పోలీసులు

రెండు రోజుల్లో రెండు ఎదురుకాల్పుల ఘటనలు

మరో మూడు రోజులుకొనసాగనున్న కూంబింగ్‌

21న ఏవోబీ బంద్‌కు మావోల పిలుపు

భగ్నం చేస్తామని స్పష్టం చేస్తున్న పోలీసులు

ఒకవైపు మావోయిస్టుల కదలికలు.. వారి జాడలు తెలుసుకునేందుకు పోలీసు బూట్ల చప్పుళ్లు.. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న విశాఖ మన్యంలో మళ్లీ అలజడి రేపుతున్నాయి.
ఏ క్షణంలో ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన, అలజడి ఒక్క విశాఖ మన్యంలోనే కాదు.. మొత్తం ఏవోబీలోనే ఉద్రిక్తతలు రేపుతోంది.
2016 అక్టోబర్‌లో రామగుడ ఎన్‌కౌంటర్‌ తర్వాత కాస్త తగ్గిన ‘ఎదురు కాల్పుల’ శబ్ధాలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. గత రెండు రోజుల్లో చోటు చేసుకున్న రెండు ఎదురుకాల్పుల ఘటనలు.. భద్రతా బలగాల విస్తృత గాలింపు చర్యలు ఏవోబీని గడగడలాడిస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ(ఆర్కే) లక్ష్యంగానే ఈ గాలింపు జరుగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులే ఆఫ్‌ ది రికార్డుగా చెబుతుండటంతో ఈ పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కన్పిస్తోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : వాస్తవానికి అవిభక్త రాష్ట్రంలో ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోటల్లా ఉన్న నల్లమల, తెలంగాణ ప్రాంతాల్లో చాలా ఏళ్ల కితమే పార్టీ దెబ్బతింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర–ఒడిశా బోర్డర్‌లో మాత్రమే పార్టీ కీలకంగా మారింది. ఇందుకు కేవలం ఆర్కే నాయకత్వమే ప్రధానమనేది వాస్తవం. పార్టీ భావజాలాన్ని, సిద్ధాంతాలను క్యాడర్‌లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు శ్రేణులకు దిశానిర్దేశం చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆర్కేను పోలీసులు టార్గెట్‌ చేస్తూ వచ్చారు. ఒక్క ఆర్కేను దెబ్బతీస్తే ఏవోబీలో మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టేయొచ్చన్న భావనలోనే పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు రామ్‌గూడ ఎన్‌కౌంటర్‌లో ఆర్కే కుమారుడు మున్నాతో సహా 39మంది మావోయిస్టులను కాల్చి చంపారు. ఆ ఘటనలో త్రుటిలో తప్పించుకున్న ఆర్కే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పట్లో ఆయన్ను  దండకారుణ్యానికి తీసుకువెళ్లారన్న ప్రచారం సాగింది.

ఆర్కే తప్పించుకున్నా... ఆయన వయస్సు, అనారోగ్యం రీత్యా ఇక ఏవోబీలో పార్టీ కోలుకోవడం కష్టమేనని పోలీసు వర్గాలు అంచనాకొచ్చాయి. అయితే పోలీసుల లెక్కలను తారుమారు చేస్తూ.. మావోలు తొందరగానే కోలుకున్నారు. ఇటీవల మావో దళ సభ్యుడిగా పనిచేసిన ఓ ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ లొంగుబాటు సందర్భంగా చెప్పిన మాటలతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. మళ్లీ ఆర్కే నాయకత్వంలోనే పార్టీ పుంజుకుంటోందని పోలీసులకు ఉప్పందింది. రామ్‌గూడ ఎన్‌కౌంటర్‌ దెబ్బకు దిశానిర్దేశం కోల్పోయిన పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ఆర్కే జనవరిలో ఏవోబీలోకి వచ్చాడని పోలీసులకు పక్కాగా సమాచారం అందిందింది.  ఆర్కే రాకతోనే మళ్లీ మావోలు బలం పుంజుకున్నారు. క్యాడర్‌ రిక్రూట్‌మెంట్, వరుస సభలు నిర్వహించడం ద్వారా పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

ఆర్కే లక్ష్యంగా..
ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ ఆర్కే పేరిట పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా డీజీపీలు మాలకొండయ్య, రాజేంద్రకుమార్‌ నాలుగురోజుల కిందట విశాఖలో సమావేశమై ఇరు రాష్ట్రాల పోలీసులకు, ప్రత్యేకించి ఏవోబీ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆర్కే జాడ కోసం కొద్దిరోజులుగా జాయింట్‌ ఆపరేషన్‌గా ఒడిశా, ఏపీ పోలీసు బలగాలు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆర్‌కేను సజీవంగా పట్టుకోవడానికి లేదా కూంబింగ్‌ సమయంలో ఎదురుపడితే ఎన్‌కౌంటర్‌ చేసేందుకైనా వెనుకాడకుండా పోలీసులు వ్యూహత్మకంగానే పావులు కదుపుతున్నారు. ఏవోబీలో పోలీసులకు కూడా ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థ గతం కంటే మెరుగవడంతో మారుమూల అటవీ ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్నారు. ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్‌ కటాఫ్‌ ఏరియా మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఆర్కే ఇక్కడే ఉంటాడనే ఆలోచనతో పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని కూడా చుట్టుముట్టాయి. పోలీసులు నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నా ఆర్కే జాడ తెలుసుకోవడం కష్టసాధ్యమేనని అంటున్నారు.పక్కాగా మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్న ఆర్కేను పట్టుకోవడం పోలీసులకు అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరో మూడు రోజులు విస్తృత గాలింపు.. జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ
ఏవోబీ పరిధిలో కూంబింగ్‌ నిరంతర ప్రక్రియే అయినప్పటికీ మరో మూడురోజులపాటు విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వెల్లడించారు. శుక్రవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ.. 21వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బంద్‌ను భగ్నం చేసేందుకు యత్నిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు