అగ్రిగోల్డ్‌ వైస్‌ చైర్మన్‌ సీతారాం అరెస్ట్‌

22 May, 2018 10:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అగ్రిగోల్డ్‌ కేసులో కీలక నిందితుడిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అగ్రిగోల్డ్‌ వైస్‌ చైర్మన్‌ అవ్వా సీతారాం (సీతా రామారావు)ను ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారులు గుర్గావ్‌లో అదుపులోకి తీసుకుని అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై ఆయనను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాం అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ వెంకట రామారావు సోదరుడు. 2011 వరకూ అగ్రిగోల్డ్‌ బోర్డు మెంబర్‌గా ఉన్న ఆయన పథకం ప్రకారం బోర్డు నుంచి తప్పకున్నారు. ఇక ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ను  సుప్రీం కోర్టులో నిరాకరించడంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అలాగే అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఎస్సెల్‌ గ్రూప్‌ కొనుగోలు చేయకుండా సీతారాం తెర వెనుక చక్రం తిప్పారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వా వెంకట రామారావు సహా తొమ్మిదిమంది అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.

కాగా పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు. ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు