మూడో చార్జిషీట్‌లో చంద్రబాబు

10 May, 2018 01:16 IST|Sakshi
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా చేర్చబోతున్న ఏసీబీ

వచ్చే వారమే కోర్టులో దాఖలు!

రూ.50 లక్షలు ఎక్కడ్నుంచి వచ్చాయో గుట్టు విప్పనున్న ఏసీబీ

సొమ్ము సమకూర్చిన వారిలో ఓ ఏపీ మంత్రి,

టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ప్రమేయం

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో మూడో చార్జిషీట్‌ సిద్ధమవుతోంది. ఇందులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చబోతోంది. ఈ కేసులో ఇప్పటికే రేవంత్‌రెడ్డిని ఎ–1గా పేర్కొంటూ ఏసీబీ రెండు చార్జి షీట్లు దాఖలు చేసింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే ఈ కేసుకు కీలకంగా మారిన రూ.50 లక్షలు ఎక్కడ్నుంచి వచ్చాయన్న దానిపై ఏసీబీకి ఆధారాలు లభించినట్లు తెలిసింది.

రేవంత్‌ రెడ్డి, సెబాస్టియన్‌ ద్వారా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు అందజేయడానికి డబ్బు సమకూర్చిన వారిలో ఒక ఏపీ మంత్రితోపాటు టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ప్రమేయాన్ని ఏసీబీ గుర్తించింది. ఈ వివరాలు మూడో చార్జిషీట్‌లో పేర్కొనే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. అలాగే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది చంద్రబాబేనంటూ హైదరాబాద్, చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ విభాగాలు వెల్లడించాయి. ఈ ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా మూడో చార్జిషీట్‌లో చంద్రబాబునాయుడు పేరును చేర్చబోతున్నారు. 

రెండు రోజుల్లో సిద్ధం 
మూడో చార్జిషీట్‌ సిద్ధమవుతోందని, రెండ్రోజుల్లో ఇది న్యాయశాఖ పరిశీలనకు వెళ్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మూడో చార్జిషీట్‌కు అవసరమైన అన్ని సాంకేతికపరమైన ఆధారాలు లభించాయని ఆ వర్గాలు తెలియజేశాయి. కేసులో మరో చార్జిషీట్‌ అవసరం ఉండకపోవచ్చని ఏసీబీ భావిస్తోంది. పూర్తి వివరాలతో వచ్చే వారంలో చార్జిషీట్‌ను వేయబోతున్నామని, అయితే ఇదే తుది చార్జిషీట్‌ అని చెప్పలేమని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో సమావేశం అనంతరం ఏసీబీ అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు. చివరి రెండు చార్జిషీట్‌లలో పేర్కొన్న కొన్ని అంశాలను మూడో చార్జిషీట్‌ ద్వారా సవరించబోతున్నారు. అప్రూవర్‌గా మారుతానని జెరూసలెం మత్తయ్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన వాంగ్మూలం మరోసారి తీసుకోవాలా లేదా అన్న విషయంలో కూడా న్యాయనిపుణులతో ఏసీబీ సంప్రదింపులు జరుపుతోంది.

చంద్రబాబే ఏ–1: న్యాయ నిపుణులు 
నోటుకు కోట్లు కేసులో ఏ–1 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అవుతారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని చంద్రబాబు స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టడం చూస్తే ఈ కేసులో అంతిమ లబ్ధిదారు ఆయనే అవుతారన్నది న్యాయ నిపుణుల వాదన. ‘‘ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితోపాటు చంద్రబాబుకు సన్నిహితుడైన సెబాస్టియన్‌ రూ.50 లక్షలు తీసుకుని స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లారు.

ఆ డబ్బు రేవంత్‌ లేదా సెబాస్టియన్‌ది కాదు. ఎవరో తెరవెనుక సమకూర్చిన డబ్బుని తెచ్చారు. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరివి, ఎక్కడ్నుంచి సమకూర్చారన్నది ఈ కేసులో ప్రధానాంశం’’అని సీనియర్‌ న్యాయవారి ఒకరు అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు తన పార్టీ అభ్యర్థికి ఓటేయ్యాలని స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెట్టడమే ఈ కేసులో కీలకం అవుతుందని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.  

మరిన్ని వార్తలు