జయరామ్‌ హత్యకేసులో కీలక మలుపు..!

6 Feb, 2019 11:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయరామ్‌  హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్త చేశారు. కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు.(ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు)

కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉండడంతోనే జయరామ్‌ కేసును బదిలీ చేసినట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో కేసును బదిలీ చేయకుండా మరింత వివాదాలకు తావు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జయరామ్‌ హత్య కేసులో శిఖాకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెప్పడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మేనకోడలు శిఖా, సొంత అక్కనుంచి ప్రాణహాని ఉందంటూ జయరామ్‌ గతంలో తనతో చెప్పినట్టు పద్మశ్రీ మీడియాకు వెల్లడించారు.

శాస్త్రీయంగా ఉండాలనే బదిలీ : డీజీపీ
కేసు బదిలీ గురించి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడుతూ..‘చిగురుపాటి జయరామ్‌ హత్యకేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నాం. ఈ మేరకు న్యాయపరమైన అనుమతులు రాగానే కేసు బదిలీ అవుతుంది. హత్యా ఘటన హైదరాబాద్‌లో జరిగిన నేపథ్యంలో కేసు దర్యాప్తు అక్కడ నుంచి జరగడమే శాస్త్రీయంగా ఉంటుంది’  అని చెప్పారు.

మరిన్ని వార్తలు