6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్‌ ఆటకట్టు

12 Feb, 2020 02:27 IST|Sakshi
నిందితుడు బసవయ్య

దిశ యాప్‌ తొలి కేసు

విశాఖ–విజయవాడ బస్సులో మహిళా అధికారిని వేధించిన ఏయూ ప్రొఫెసర్‌ 

సమాచారం అందుకున్న నిమిషాల వ్యవధిలో స్పందించిన పోలీసులు

రాష్ట్రంలో దిశ యాప్‌ ద్వారా తొలి కేసు నమోదు

దిశ యాప్‌ను తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వంపై మహిళల హర్షాతిరేకాలు

తెల్లవారుజాము 4.21 గంటల సమయం.. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు..ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌ప్లాజా..ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు... ఓ పోకిరిలో మాత్రం కామ పిశాచి నిద్ర లేచింది..!ఉన్నతమైన అధ్యాపక వృత్తిలో ఉన్నా వివేకం నశించడంతో అసభ్య చేష్టలకు దిగాడు..ధైర్యాన్ని కూడదీసుకున్న బాధిత మహిళ  ‘దిశ యాప్‌’ ద్వారా సమాచారం ఇచ్చారు...ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను క్షేమంగా గమ్య స్థానానికి పంపించారు.

సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ ఏలూరు టౌన్‌ : ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘దిశ’ యాప్‌ సత్ఫలితాన్నిచ్చింది.. వేళకాని వేళ మహిళపై వేధింపులకు దిగిన ఓ పోకిరీ భరతం పట్టింది.. తక్షణ రక్షణ తథ్యం.. అని నిరూపించింది.. కేవలం ఆరు నిమిషాల్లో పోలీసులను బాధితురాలి వద్దకు చేర్చి అభయమిచ్చింది.. తద్వారా అక్కచెల్లెమ్మల జోలికొస్తే ఖబడ్దార్‌.. అని హెచ్చరించింది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్‌ ప్రారంభమైన నేపథ్యంలో తొలిసారి ఓ మహిళకు అండగా నిలిచింది. 

భరోసా కల్పించిన దిశ యాప్‌..
ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్‌ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున మహిళా అధికారి సీటు వద్దకు చేరుకుని పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. ముఖ్యమంత్రి జగన్‌ తాజాగా ప్రారంభించిన దిశ యాప్‌ గుర్తుకురావటంతో బాధితురాలు 4.21 గంటల సమయంలో తన మొబైల్‌ ఫోన్‌ను ఐదు పర్యాయాలు అటుఇటు కదిలించారు.

యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ను నొక్కటంతో ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్‌ గ్రేవల్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్‌ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు(కాల్‌ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ధైర్యం చెప్పి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడికి రిమాండ్‌ విధించిన కోర్టు
బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏయూ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ కె.బసవయ్య నాయక్‌పై ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ తెలిపారు. అనంతరం పెదపాడు పోలీస్‌ స్టేషన్‌కు రిఫర్‌ చేయడంతో క్రైమ్‌ నెంబర్‌ 52/2020 సెక్షన్‌ 354, 354(ఏ) కింద కేసు నమోదు చేశారు. బసవయ్య నాయక్‌ను కోర్టులో హాజరుపరచగా  రిమాండ్‌ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్‌ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న బసవయ్యపై చర్యలు తీసుకుంటామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆకతాయి ప్రొఫెసర్‌ అరెస్టు వరకు దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్‌ పర్యవేక్షించారు. 

పోలీసులకు సీఎం జగన్‌ అభినందనలు
దిశ యాప్‌ ద్వారా అందిన తొలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి జగన్‌ అభినందనలు తెలిపారు. పోలీసులు అతి తక్కువ సమయంలో స్పందించి ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచారని ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులను కోరారు. ఘటన వివరాలను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. 

ఆరు నిమిషాల్లో ఆరు కి.మీ
– బాధితురాలు ఆపదలో ఉన్నట్లు దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్‌ కానిస్టేబుల్‌ నాగదాసి రవి ఆరు కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లో చేరుకున్నాడు. 
– త్రీటౌన్‌ ఎస్‌ఐ బీఎస్‌డీఆర్‌ ప్రసాద్, మరో కానిస్టేబుల్‌ టి.సతీష్‌ కూడా స్వల్ప వ్యవధిలోనే అక్కడకు చేరుకుని నిందితుడిని బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్నారు. 
– బాధిత అధికారి 4.10 గంటల సమయంలో తొలుత విశాఖ మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌కి ఫోన్‌ చేయగా డయల్‌–100కి కాల్‌ చేయాలని సూచించారు. ఆ వెంటనే బాధితురాలు దిశ యాప్‌ను వినియోగించడంతో అతి వేగంగా సాయం అందింది.

మరిన్ని వార్తలు