సొత్తు రికవరీ సత్తా ఏదీ!

22 Oct, 2018 12:04 IST|Sakshi

ఏటా సుమారు వంద కోట్ల సొమ్ము చోరీ

రికవరీ చేయలేకపోతున్న పోలీసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బందోబస్తులతో పాటు పాలకపక్ష అజెండా బరువును భుజాలపై మోస్తున్న పోలీసు శాఖ చోరీ సొత్తు రికవరీపై దృష్టి పెట్టలేకపోతోంది. ఏటా దాదాపు రూ.వంద కోట్లు సొత్తు (సొమ్ము) చోరీకి గురౌతుంటే కనీసం సగం కూడా రికవరీ చేయలేని పరిస్థితి పోలీస్‌ శాఖది. నాలుగేళ్ల క్రితం వరకు ప్రతీ నెల జిల్లా, డివిజన్, సర్కిల్‌ స్థాయిల్లో జరిగే పోలీసుల నెలవారీ నేర సమీక్షల్లో చోరీల విషయంలో ఖచ్చితమైన సమీక్ష జరిగేది. దీంతో ఆయా స్థాయిల్లోని పోలీసు అధికారులు చోరీ సొత్తు రికవరీ గురించి సంజాయిషీ చెప్పుకోవాల్సి రావడంతో దానికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. చోరీ సొమ్ము రివకరీలో ప్రతిభ కనబరిచిన వారికి అప్పట్లో నగదు అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలను పోలీసు శాఖ ఇచ్చేది.

అన్ని నేరాల కంటే చోరీ సొత్తు విషయాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని నిర్లక్ష్యం వహించే సిబ్బందిపైన చర్యలు ఉండేవి. రానురాను పోలీసు శాఖ తీరు మారడంతో నెలవారీ సమీక్షల్లో సొత్తు రికవరీ అంశాన్ని మొక్కుబడి తంతుగానే ముగిస్తున్నారు. గడిచిన రెండేళ్ల లెక్కలు గమనిస్తే పోలీసు శాఖ సొత్తు రివకరీని పట్టించుకోవడంలేదనే విషయం తేట్టతెల్లమవుతోంది. 2017లో రూ.129 కోట్ల 15 లక్షలు సొత్తు చోరీకి గురైతే కేవలం రూ.54 కోట్ల 8 లక్షలు మాత్రమే పోలీసులు రివకరీ చేసి బాధితులకు అందించగలిగారు. అలాగే 2018 జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.81.29 కోట్ల లక్షలు సొత్తు చోరీకాగా రూ.40.97 కోట్ల రికవరీ చేశారు. దీంతో చోరీల్లో సొమ్ము పోగొట్టుకున్న సంస్థలు, బాధితులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

కలకలం రేపిన చోరీలు ఇవీ...
రాష్ట్రంలో ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో సంచలనం రేపిన చోరీలను చేధించినట్టు పోలీసు శాఖ తాజాగా విడుదల చేసిన ఆగస్టు నెల క్రైమ్‌ బులెటిన్‌లో ప్రస్తావించింది.

  • ఈ ఏడాది జూలై 27న అనంతపురం ఎస్‌బీఐ బ్రాంచిలో గ్యాస్‌సిలెండర్‌ కట్టర్‌తో ఇసుప కిటికి తొలగించిన దొంగలు రూ.39,18,541 నగదును దోపిడీ చేశారు. ఆగస్టు 11 నుంచి 13 వ తేదీలోపు ఏడుగురు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి రూ.12 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు.
  • అనంతపురం జిల్లా కదిరి ఆంజనేయస్వామి గుడిలో ఆగస్టు 27న రూ.8.60లక్షలు చోరీకి పాల్పడిన దొంగల ముఠాను ఆగస్టు 30న పట్టుకున్న పోలీసులు రూ.6.50 లక్షలు రికవరీ చేశారు.
  • కర్నూలు పట్టణంలోని రాజ్‌ విహార్‌ సెంటర్‌లో ఆగస్టు 15న ఎం.రామకృష్ణారెడ్డి తీసుకువెళ్తున్న రూ.50 లక్షలను చోరీకి పాల్పడిన వ్యక్తిని ఆగస్టు 30 న అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి రూ.47.84 లక్షలు వసూలు చేశారు.


Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా