ఉసురుతీసిన ఆక్వా సాగు

30 Aug, 2019 08:18 IST|Sakshi
మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు 

సాక్షి, పాలకొల్లు(పశ్చిమగోదావరి) : సిరులు కురిపించే ఆక్వా సాగులో నష్టాలు రావడంతో రైతు కుంగిపోయాడు. వంశపారంపర్యంగా వచ్చిన వ్యవసాయ భూమిని, ఇంటి స్థలాన్ని విక్రయించినా అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. పురుగుమందు తాగి ఆక్వా రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పోడూరు మండలం వద్దిపర్రులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలకొల్లు మండలం లంకలకోడేరుకి చెందిన ఆరేపల్లి సూర్య వెంకట సురేష్‌కుమార్‌ (39) పోడూరు మండలం వద్దిపర్రులో రొయ్యల చెరువు సాగు చేస్తున్నాడు. దీంతో పాటు అడపాదడపా వరి కూడా సాగుచేస్తుంటాడు.

గతంలో లంకలకోడేరులో ఉన్న ఉమ్మడి ఆస్తి సుమారు ఆరు ఎకరాలు విక్రయించి పోడూరు మండలం వద్దిపర్రులో ఆరు ఎకరాలు కొనుగోలు చేసి రొయ్యల సాగు మొదలుపెట్టాడు. అయితే ఆక్వాసాగు అతడికి కలిసిరాలేదు. అప్పులుపాలు కావడంతో వద్దిపర్రులో తన పేరు మీద ఉన్న పొలాన్ని విక్రయించి కొంతమేర బాకీలు తీర్చాడు. తల్లిదండ్రుల పేరు మీద ఉన్న మరో మూడు ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నాడు. అప్పులు బాగా పెరిగిపోవడంతో గతేడాది లంకలకోడేరులో ఉన్న మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని కూడా విక్రయించి కొన్ని బాకీలు తీర్చాడు. ఇటీవల రొయ్యల చెరువు పట్టుబడి పట్టగా సుమారు రూ.3 లక్షలకు పైగా నష్టం వచ్చింది. దీంతో పాత, కొత్త అప్పులు కలిపి సుమారు రూ.10 లక్షల వరకు ఉన్నాయి. ఒకవైపు అప్పుల బాధ వేధిస్తుండగా మరోపక్క భార్యాభర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం వద్దిపర్రులో రొయ్యల చెరువు వద్ద సురేష్‌కుమార్‌ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు ఉన్నాయి.  

ఇద్దరు కుమారులను పోగొట్టుకున్న తండ్రి
వృద్ధులైన ఆరేపల్లి సింహాచలం, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సురేష్‌కుమార్‌ కాగా  చిన్నకుమారుడు రమేష్‌. రమేష్‌ దాదాపు 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి అక్కడ జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. సురేష్‌కుమార్‌ వ్యవసాయం చేసి తల్లిదండ్రులు, భార్యాబిడ్డలను పోషి స్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో సురేష్‌కుమార్‌ ఆత్మహత్య ఆ కుటుంబాన్ని మరింత కుం గదీసింది. వృద్ధాప్యంలో తమకు దిక్కెవరని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. భా ర్య రాజేశ్వరి, కుమారుల రోదనలు మిన్నం టాయి. పోలీసులు మృతదేహానికి పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్‌ సీఐ దేశింశెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పో డూరు ఎస్సై బి.సురేంద్రకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు పరామర్శ 
విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న సురేష్‌కుమార్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయాధికారులతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు