నడివీధిలో మహిళా ఆర్కిటెక్ట్‌ను వెంటాడి..

5 Nov, 2019 08:36 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

న్యూఢిల్లీ : ఢిల్లీలో మహిళలపై వేధింపులు, లైంగిక దాడులకు బ్రేక్‌ పడటం లేదు. దక్షిణ ఢిల్లీలోని ఓ కాలనీలో 39 ఏళ్ల మహిళా ఆర్కిటెక్ట్‌ను ఆదివారం రాత్రి ఆరుగురు వ్యక్తులు వెంటాడి వేధించిన ఘటన వెలుగుచూసింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఆరుగురు వ్యక్తులు తన కారును చుట్టుముట్టారని, తాను వారిని పక్కకు జరగాలని కోరగా వారిలో ఒకరు తన మీదకు దూసుకువచ్చి అసభ్యంగా తాకాడని, మరో వ్యక్తి సైతం ఇలాంటి చేష్టలకు దిగాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తాను వారిని ప్రతిఘటించడంతో తన ముఖంపై పిడిగుద్దులతో దాడి చేశారని, జుట్టు పట్టి లాగారని చెప్పారు. వారిని తప్పించుకుని కారులో ఇంటికి చేరగా, వారిలో ఒకరిని తన ఇంటి వద్ద చూశానని, తనను చూడటంతో అతను పారిపోయాడని వివరించారు. రోజూ తన వెంట డ్రైవర్‌ ఉండేవాడని, అతనికి వీక్‌ఆఫ్‌ కావడంతో ఒంటరిగా ఉండటాన్ని వారు అవకాశంగా తీసుకున్నారని తెలిపారు. మహిళ తెలిపిన వివరాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 15 రోజులుగా తమ కాలనీలో అల్లరి మూక తాగి తూలుతూ కాలనీవాసులకు అసౌకర్యం కల్పిస్తున్నారని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించారు.

>
మరిన్ని వార్తలు