వృద్ధాశ్రమానికి తల్లి తరలింపు.. అంతలోనే!

6 Jul, 2018 12:43 IST|Sakshi

ప్రియురాలి మోజులో పడి తల్లిని నిర్లక్ష్యం చేశాడు. నానా హింసకు ఆమెను గురిచేశాడు. చివరకు వదిలించుకోవాలని యత్నించిన కొడుక్కి.. ఆ తల్లి శిక్ష విధించింది. అది మరణ శిక్ష...

వాషింగ్టన్‌: అరిజోనా రాష్ట్ర రాజధాని ఫియోనెక్స్‌ పట్టణం.. ఫౌంటేన్‌ హిల్స్‌లో 92 ఏళ్ల  అన్నా మే బ్లెస్సింగ్‌,తన కొడుకు(72) తో జీవిస్తోంది. అయితే ఆరు నెలలుగా ఓ అమ్మాయి(25 ఏళ్ల లోపు)తో ఆ పెద్దాయన డేటింగ్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలో తల్లిని నిర్లక్ష్యం చేయగా.. ఆమె సహించింది. నిత్యం తులనాడుతూ కొడుకు ప్రియురాలు అవమానించినా భరించింది. చివరకు ఆమెను వృద్ధాశ్రమానికి తరలించాలని యత్నించటంతో తట్టుకోలేకపోయింది. 

సోమవారం తల్లిని ఓల్డేజ్‌ హోమ్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో ఆమె తన వద్ద దాచుకున్న తుపాకీతో కొడుకు, అతని ప్రియురాలిపై కాల్పులు జరిపింది. కొడుకు మెడలోంచి బుల్లెట్లు దూసుకుపోవటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. ప్రియురాలు తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కొడుకు శవం ముందు ఆ తల్లి ఈ వీల్‌ ఛైర్‌లో కూర్చుని ఉంది. ‘నా జీవితాన్ని నువ్వు లాగేసుకున్నావ్‌.. ఇప్పుడు నీ బతుకును నేను తీసేసుకున్నా’ అంటూ ఆమె కంటతడి పెట్టుకుంది. జరిగిందంతా అక్కడున్న వారికి వివరించింది. ఆపై ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆమె తరపున కేసును ఉచితంగా వాదించేందుకు ఓ న్యాయవాది(అటార్నీ) ముందుకు రావటం విశేషం. 
 

మరిన్ని వార్తలు