రైలు ప్రమాదంలో ఆర్మీ హవాల్దార్‌ మృతి?

3 Oct, 2019 07:55 IST|Sakshi
గాయాలతో రవిబాబు, హవల్దార్‌గా తుపాకీ చేతబట్టి...

సాక్షి, వంగర(శ్రీకాకుళం) : మండలంలోని కొప్పర గ్రామానికి చెందిన ఆర్మీ హవల్దార్‌ కుప్పిలి రవిబాబు రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కుప్పిలి వెంకటి, బోడమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మరో ఆర్నెల్లలోనే ఉద్యోగం పూర్తి చేసుకుని వచ్చేస్తాడని, ఇంతలో ఈ ఘోరం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. దీంతో బుధవారం గ్రామంలో విషాదం అలుముకుంది. బంధువుల కథనం మేరకు... 17ఏళ్ల క్రితం ఆర్మీ జవాన్‌గా విధుల్లోకి చేరి ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ హవల్దార్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్టోబర్‌ 29న సహచర ఉద్యోగులతో కలిసి సెలవుపై స్వగ్రామం కొప్పర వచ్చేందుకు న్యూఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. అదే రోజు మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌–ఝాన్సీ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాల పక్కన తుప్పల్లో రవిబాబు తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారు. ఇతను మెడలో ఐడీ కార్డు సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతుండగా, పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న మృతుడి భార్య రమణమ్మ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వీరికి కుమారుడు అభిషేక్, కుమార్తె సుష్మిత ఉన్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుందో తెలియరావడం లేదు. రైల్లోంచి ఈయన ప్రమాదవశాత్తు పడిపోయాడా? లేదా సహ ఉద్యోగులతో ఏమైనా విభేదాలతో తొసివేశారా? అన్నది స్పష్టమైన సమాచారం లేదు. బోగీలో తమ తోటి ఉద్యోగి లేకపోవడాన్ని గుర్తించి వారు విజయవాడ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కుటుంబ సభ్యులకు పూర్తిగా వివరాలు తెలియలేదు. ఈ మేరకు మృతదేహాన్ని లక్నో నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు విమానంలో తీసుకొచ్చి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో స్వగ్రామం తరలించేందుకు ఆర్మీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు