విధి చేతిలో ఓడిన సైనికుడు

27 Sep, 2019 08:19 IST|Sakshi
మృతదేహాన్ని తీసుకొచ్చిన వాహనం, పాపారావు మృతదేహం

అనునిత్యం ఫిరంగుల మోతలతో దద్దరిల్లే దేశ సరిహద్దులో విధి నిర్వహణకు ఏనాడూ అధైర్యపడలేదు. శత్రువుల భీకర దాడులను ధీటుగా తిప్పికొట్టాడు. విధి చేతిలో మాత్రం ఓడిపోయాడు ఆ సైనికుడు. యుద్ధమంటే ఉప్పొంగే గుండె ధైర్యం క్యాన్సర్‌ మహమ్మారి ముందు చిన్నబోయింది. రణరంగంలో కీలుగుర్రంలా దూసుకుపోయే అతడి కాళ్లను బంధించి అణువణువునా మింగేసింది. బోన్‌ క్యాన్సర్‌ బారిన పడి మృతి చెందిన బొడ్డపాడు గ్రామానికి చెందిన జవాను పాపారావుకు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 

సాక్షి, పలాస(శ్రీకాకుళం) : మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన వీర జవాను బుడత పాపారావు(38) పేద రైతు కుటుంబంలో పుట్టి దేశ సైనికునిగా సేవలందించడానికి సైన్యంలో చేరాడు. జవాను నుంచి నాయక్‌ స్థాయికి ఎదిగాడు. తన బెటాలియన్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం భోపాల్‌లో నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో పుణెలోని సైనిక ఆస్పత్రిలో చేరాడు. అక్కడ మెరుగైన వైద్య సేవలంది మళ్లీ కోలుకుని సైన్యంలో చేరి విధులు నిర్వహిస్తాడని అందరూ ఆశించారు. అయితే విధి వక్రీకరించింది. ఆయనకు బోన్‌ క్యాన్సరు ఉందని అక్కడ వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ అన్ని ప్రయత్నాలు చేసి వైద్య సేవలందించినా ఫలితం లేకపోయింది. మృత్యువుతో పోరాడుతూ ఈ నెల 24న ఉదయం 9 గంటలకు మృతి చెందాడు.

తమ ఒక్కగానొక్క కుమారుడు జవాను నుంచి నాయక్‌ హోదాకు ఎదిగాడని ఎంతగానో ఆనందించిన అతడి తల్లిదండ్రులు పార్వతి, మోహనరావు ఈ విషయం తెలుసుకుని జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం తమ స్వగ్రామానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతుడి భార్య ఉష, కుమారుడు యువరాజు(9), కుమార్తె (6) ఉషిత శోకతప్త హృదయాలతో విలపించారు. వీరిని ఓదార్చడానికి ప్రయత్నించిన గ్రామస్తులు, బంధువులు కూడా కన్నీళ్లు పెట్టారు. అనంతరం సహచర సైనికులు సైనిక వందనం చేసి మృతదేహంపై జాతీయ జెండా కప్పి అంతిమ యాత్ర చేపట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు