పెళ్లికి నిరాకరించిందని ఆర్మీ మేజర్‌ కిరాతకం

25 Jun, 2018 09:04 IST|Sakshi
మేజర్‌ అమిత్‌ ద్వివేది భార్య శైలజ, నేరస్తుడు మేజర్‌ నిఖిల్‌ హండా

న్యూఢిల్లీ : ఆర్మీ మేజర్‌ అమిత్‌ ద్వివేది భార్య శైలజ హత్య కేసులో ప్రధాన నిందుతుడు మేజర్‌ నిఖిల్‌ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. శైలజ, నిఖిల్‌ హండాను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతోనే నిఖిల్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఆర్మీ మేజర్‌గా పనిచేస్తున్న నిఖిల్‌ హండాకు 2015లో నాగలాండ్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. అదే సమయంలో శైలజ భర్త మేజర్‌ ద్వివేదికి కూడా నాగలాండ్‌లోనే పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ విధంగా నిఖిల్‌, శైలజల మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగా మారారు. కొంత కాలం తర్వాత నిఖిల్‌, శైలజను వివాహం చేసుకోవాల్సిందిగా కోరాడు. కానీ శైలజ అందుకు అంగీకరించలేదు.

అయితే వీరిద్దరి స్నేహం గురించి శైలజ భర్త మేజర్‌ ద్వివేదికి తెలిసింది. దాంతో అతడు శైలజ, నిఖిల్ల మధ్య ఎటువంటి కాంటక్ట్‌ ఉండకూడదని వారించాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నిఖిల్‌ కొడుకు ఆరోగ్యం పాడవడంతో అతన్ని ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ఆస్పత్రిలో చేర్చాడు. ఇదే సమయంలో శైలజ కూడా ఢిల్లీలోనే ఉంది. కొడుకు వైద్యం కోసం ఢిల్లీకి వచ్చిన నిఖిల్‌ శైలజకు ఫోన్‌ చేసి తనను కలవాల్సిందిగా కోరాడు. దాంతో గత శనివారం శైలజ ఇంట్లో ఫిజియోథెరపికి వెళ్తున్నాని చెప్పి బయటకు వచ్చింది. అయితే శైలజను ఫిజియోథెరపికి తీసుకెళ్లడానికి ద్వివేది ప్రభుత్వ వాహనాన్ని ఏర్పాటు చేశాడు.  ఫిజియోథెరపి కోసం వెళ్లిన శైలజ తిరిగిరాలేదని తెలిపాడు డ్రైవర్‌.

ఫిజియోథెరపీ కోసం వెళ్లిన శైలజ నిఖిల్‌ హండాను కలిసింది. ఆ సమయంలో నిఖిల్‌ తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శైలజను కోరాడు. ఈ విషయం గురించి వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. శైలజ వివాహనికి నిరాకరించడంతో విచక్షణ కోల్పోయిన నిఖిల్‌ వెంట తెచ్చుకున్న కత్తితో శైలజ గొంతు కోసి చంపాడు. శైలజ మరణాన్ని ఆక్సిడెంట్‌గా చిత్రికరించడానికి ఆమె మృత దేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు.అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రికి వెళ్లి తన కుమారున్ని కలిసి యథాప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న మీరట్‌(ఉత్తరప్రదేశ్‌)కు వెళ్లి పోయాడు. ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు.

శనివారం మధ్యాహ్నం రోడ్డు మీద శైలజ మృత దేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మరణించిన వ్యక్తిని శైలజగా గుర్తించి, కేసు నమోదు చేశారు. శైలజ భర్త మేజర్‌ ద్వివేది, నిఖిల్‌ హండా మీద అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇలోపు శైలజ ఫోన్‌లో నిఖిల్‌ హండాకు, శైలజకు మధ్య జరిగిన సంభాషణను పరిశీలించిన పోలీసులు నిఖిల్‌ హండాను నేరస్తుడిగా నిర్ధారించారు. దాంతో ఒక పోలీసులు బృందం  ఆదివారం మీరట్‌ వెళ్లి నిఖిల్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు