నకిలీ వైద్యుడి అరెస్ట్‌

21 Jul, 2018 01:09 IST|Sakshi

ఎండీ గోల్డ్‌ మెడలిస్టుగా అవతారమెత్తిన ల్యాబ్‌ టెక్నీషియన్‌  

తొర్రూరు: ఓ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆస్పత్రి ఎండీగా అవతారమెత్తాడు. ఈ నకిలీ వైద్యుడు చివరకు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలను డీఎస్పీ రాజారత్నం వెల్లడించారు. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సరికొండ వెంకట కృష్ణంరాజు అలియాస్‌ రాంబాబు తండ్రి భూపతిరాజు ఆర్‌ఎంపీగా పనిచేసేవాడు. వెంకట కృష్ణంరాజు తండ్రి వద్ద ఆర్‌ఎంపీగా శిక్షణ పొందాడు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చేసి గుంటూరు జిల్లా ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేశాడు.

రాంబాబు దొర అనే వైద్యుడి సర్టిఫికెట్ల కలర్‌ జిరాక్స్‌లపై ఫొటో మార్ఫింగ్‌ చేసి తొర్రూరు చింతలపల్లి రోడ్డులో అమృత ఆస్పత్రి నెలకొల్పాడు. నాలుగేళ్లుగా ఎండీ గోల్డ్‌ మెడలిస్ట్‌ బోర్డు పెట్టుకుని అర్హత లేకు న్నా అన్ని రకాల వైద్యసేవలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వైద్యుల నియామక కౌన్సెలింగ్‌కు అసలైన అర్హతలు గల డాక్టర్‌ రాంబాబుదొర, తొర్రూరుకు చెందిన ఓ వైద్యుడు హాజరు కాగా నకిలీ వైద్యుడి బాగోతం బయటపడింది. మీడియాలో కథనాలు రావడంతో నకిలీ వైద్యుడు పరారయ్యాడు. డిప్యూటీ డీఎంహెచ్‌వో కోటాచలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, పోలీసులకు లొంగిపోయాడు.  

మరిన్ని వార్తలు