సిండి ‘కేటుగాళ్లు’!

28 Jun, 2019 12:37 IST|Sakshi

మద్యం వ్యాపారుల కుమ్మక్కు

మార్కెట్‌లో బీర్ల కృత్రిమ కొరత

 వైన్స్‌లో డిమాండ్‌ లేని బీర్ల అమ్మకాలు

చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు 

సాక్షి, మెదక్‌: జిల్లాలో మద్యం వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. సిండికేటుగా మారి అధిక ధరలతో విక్రయిస్తున్నా.. బెల్ట్‌ షాపులకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నా.. కృత్రిమ కొరత సృష్టించి బీర్లను వైన్స్‌ షాపుల నుంచి బార్లకు తరలించి అమ్మకాలు చేస్తున్నా.. వారిని అడిగే నాథుడే కరువయ్యాడు. వాటన్నింటినీ నియంత్రించాల్సిన ఎక్సైజ్‌ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలతోపాటు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ధనార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు కుమ్మక్కయ్యారు. సిండికేట్‌గా మారి అధిక ధరలతో విక్రయాలు చేస్తూ మద్యం ప్రియుల జేబులను కొల్లగొడుతున్నారు. అవినీతికి అలవాటు పడ్డ పలువురు ఎక్సైజ్‌ శాఖ అధికారులకు డబ్బుల ఎర చూపి.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. డిమాండ్‌ ఉన్న బీర్లకు సంబంధించి మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి అక్రమంగా బార్లకు తరలిస్తున్నారు. ఇదేక్రమంలో వైన్స్‌ దుకాణాల్లో మార్జిన్‌ ఎక్కువ వచ్చే.. డిమాండ్‌ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అయినా.. ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పలు వైన్స్‌లలో అదనంగా వసూళ్లు
జిల్లాలోని కొల్చారం మండలంలో ఉన్న చిన్నఘణపూర్‌లో ఒక మద్యం డిపో ఉంది. ఇక్కడి నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాలకు మద్యం సరఫరా అవుతుంది. ఈ డిపో పరిధిలోని రెండు జిల్లాల్లో మొత్తం 99 వైన్స్‌ దుకాణాలు, 8 బార్లు ఉన్నాయి. ఇందులో మెదక్‌ జిల్లాకు సంబంధించి 37 వైన్స్‌ షాపులు, రెండు బార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

మెదక్, నర్సాపూర్, తూప్రాన్‌.. ఇలా ప్రాంతాల వారీగా మద్యం వ్యాపారులు పలువురు సిండికేట్‌గా మారి ఒక్కో బీరు, వైన్, బ్రాందీ, విస్కీ సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.5 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 1,200కు పైగా ఉన్న బెల్ట్‌షాపులతోపాటు పలు దాబాలకు కూడా అనధికారికంగా మద్యం సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

పట్టణంలో రాత్రి 9.30 గంటలకే మూత
మెదక్‌ పట్టణంలో ఐదు వైన్స్‌ షాపులు.. రెండు బార్లు ఉన్నాయి. వైన్స్‌ షాపులు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉండాలి. నిర్వాహకులు ఇటీవల రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్యనే క్లోజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్లకు వెళ్లక తప్పడం లేదు. బార్ల నిర్వాహకులు ఒక్కో బీర్‌కు అదనంగా రూ.30 వరకు వసూలు చేస్తుండడంతో మద్యం ప్రియుల జేబులు ఖాళీ అవుతున్నాయి. 

రెండు వైన్స్, రెండు బార్‌ షాపులు ఒక్కరివే కావడంతో..
మెదక్‌ పట్టణంలోని ఓ వ్యక్తి రెండు వైన్స్‌ షాపులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తికి ఇదే ప్రాంతంలో రెండు బార్‌ షాపులు ఉన్నాయి. బార్‌ షాపుల్లో అయితే బీరుకు అదనంగా రూ.30 వరకు సమకూరుతుండడం.. స్నాక్స్‌ ఇతరత్రా వాటికి బిల్లు కూడా వస్తుండడంతో సదరు వ్యక్తి నిర్దేశిత సమయం కంటే వైన్స్‌ షాపులను గంట, అరగంట ముందే బంద్‌ చేస్తున్నట్లు సమాచారం.

రాత్రి ముందుగానే వైన్స్‌ దుకాణాలను బంద్‌ చేస్తే.. మద్యం ప్రియులు తప్పనిసరి పరిస్థితుల్లో బార్‌ షాపులకు వెళ్తారని ప్లాన్‌ వేసిన సదరు వ్యక్తి ఇతర వైన్స్‌ నిర్వాహకులతో కలిసి సిండికేట్‌ అయినట్లు మద్యం ప్రియుల ద్వారా తెలిసింది. 

వైన్స్‌లో మార్జిన్‌ బీర్ల అమ్మకాలకే మొగ్గు
ఎండాకాలం బీర్ల కొరత పేరిట సదరు వైన్స్‌ దుకాణాల నిర్వాహకుడు కొత్త ఎత్తుగడకు తెరలేపాడు. ఎక్కువ మార్జిన్‌ వచ్చే డిమాండ్‌ లేని బీర్లను మద్యం ప్రియులకు అంటగడుతున్నారు. ఇదే సమయంలో ఎక్కువ డిమాండ్‌ ఉన్న బీర్లను తన బార్‌ షాపులకు తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి పది గంటలకు మూసివేయాల్సిన వైన్స్‌ షాపులను తొందరగా బంద్‌ చేసి.. మద్యం ప్రియులు బార్‌ షాపులకు వెళ్లేలా చూస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పట్టించుకోని ఎక్సైజ్‌ అధికారులు
వైన్స్‌లు నిర్దేశిత సమయం కంటే ముందుగానే బంద్‌ చేస్తున్నా.. పలు వైన్స్‌ దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నా ఎక్సైజ్‌ అధికారులు గానీ.. పోలీసులు గానీ పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలనెలా పలువురు అధికారులు, సిబ్బందికి మామూళ్లు అందుతుండడంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం
ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో నర్సాపూర్‌ ప్రాంతంలో పలు షాపులపై కేసులు నమోదు చేశాం. మెదక్‌ టౌన్‌ పరిధిలో నిర్దేశిత సమయం కంటే వైన్స్‌లను ముందుగానే బంద్‌ చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
                        – శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

బార్‌కు వెళ్తే జేబు గుల్ల 
ఇటీవల ఓ ప్రాంతానికి టూర్‌ వెళ్లి వచ్చాను. ఫ్రెండ్స్‌ పార్టీ అంటే.. వారితో కలిసి మెదక్‌ పట్టణంలోని వైన్స్‌ షాపునకు వచ్చా. రాత్రి తొమ్మిదిన్నర కూడా కాలేదు. వైన్స్‌ షాప్‌ బంద్‌ ఉంది. ఇంకో దుకాణానికి వెళ్లా. అదీ మూసి ఉంది. ఇలా అన్ని వైన్స్‌ షాపులు మూసి ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో బార్‌కు వెళ్లాల్సి వచ్చింది. బిల్లు చూస్తే గుండె పోటు వచ్చినట్లయింది. జేబు గుల్ల అయింది. వైన్స్‌లో తీసుకుంటే సగం పైసలు కూడా కావు.  
                          – సురేష్, మెదక్‌   

మరిన్ని వార్తలు