మొదట నవ్వాడు..ఆ తర్వాత ఏడ్చాడు

25 Apr, 2018 18:36 IST|Sakshi
జైలు శిక్ష పడిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు(పాత చిత్రం)

జోథ్‌పూర్‌ : మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు బుధవారం మొదట కోర్టులో హాలులోకి రాగానే న్యాయమూర్తిని చూసి నవ్వాడని, ఆ తర్వాత న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు వినగానే ఘొల్లుమని ఏడ్చాడని, ఆ పిమ్మట శిక్ష తగ్గించాలని వేడుకున్నట్లు తెలిసింది. కోర్టు తీర్పు వెలువరిచే సమయంలో మతపరమైన పాటలను పాడటం ప్రారంభించాడని తెలిసింది. ఆ తర్వాత అతని లాయర్‌ వైపు చూసి అతనేమైనా తీర్పు విషయంలో తనకు అనుకూలంగా చేయగలడా అన్నట్లు చూశాడని తెలిసింది.

తీర్పు వెలువడిన వెంటనే తన చేతులతో నెత్తిని కొట్టుకుంటూ ఏడ్చాడని కోర్టులో ఉన్నవారి ద్వారా తెలిసింది.  తన ఆశ్రమంలో16 ఏళ్ల బాలికపై 2013లో ఆశారాం అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారాం బాపుపై ఐపీసీ సెక్షన్‌-376, పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఆశారాంపై నేరం నిరూపితం కావడంతో  జోథ్‌పూర్‌ షెడ్యూల్‌ కాస్ట్‌ అండ్‌ ట్రైబల్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. ఆశారాంకు సహకరించినందుకు గానూ శరత చంద్ర‌, శిల్పి అనే ఇద్దరు అనుచరులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించారు. 

మరో ఇద్దరు నిందితులు శివ, ప్రకాశ్‌లను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పు వెలువడగానే ఆశారాం ప్రతినిథి నీలం దూబే మాట్లాడుతూ..న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, తీర్పుపై పైకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు. డేరా బాబా కేసు విషయంలో తీర్పు వెలువరిచే సమయంలో గొడవలు జరగడంతో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జోథ్‌పూర్‌ సెంట్రల్‌ జైలు ఆవరణలోనే న్యాయమూర్తి విచారణ ప్రారంభించి ఈ తీర్పు వెలువరించారు.

>
మరిన్ని వార్తలు