సిట్‌ విచారణకు అశోక్‌ మళ్లీ డుమ్మా! 

14 Mar, 2019 02:50 IST|Sakshi

డేటా చోరీ కేసులో రెండుసార్లు నోటీసులిచ్చినా ఫలితం సున్నా 

ఫిర్యాదుదారుల వాంగ్మూలం నమోదు 

ఐటీ గ్రిడ్స్‌ ఉద్యోగులను మరోసారి ప్రశ్నించిన పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల డేటా చోరీకి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ విచారణకు హాజరుకాలేదు. విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ అశోక్‌కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్‌బీలోని అశోక్‌ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్‌ స్పందించలేదు. బుధవారం విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. 

ఫిర్యాదుదారుల వాంగ్మూలం రికార్డు.. 
ఏపీలో 3.6 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటాను సేవామిత్ర యాప్‌ ద్వారా టీడీపీ తస్కరిస్తోందని మార్చి 2న విజిల్‌ బ్లోయర్‌ లోకేశ్వర్‌రెడ్డి మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించాడు. ఆ మర్నాడే దశరథరామిరెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాంటి ఫిర్యాదుతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్‌ కమిషనరేట్లలో కేసులు నమోదయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం లోకేశ్వర్‌రెడ్డి, దశరథరామిరెడ్డిలను పోలీసులు సిట్‌ కార్యాలయానికి పిలిపించారు. వారిని ప్రశ్నించిన పోలీసులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. వీరితో పాటు ఐటీ గ్రిడ్స్‌ సంస్థలో ఉద్యోగులైన ఫణి, భాస్కర్, విక్రమ్, చంద్రశేఖర్‌లను కూడా మరోసారి ప్రశ్నించారు. కాగా, గూగుల్, అమెజాన్‌ల నుంచి సమాచారం ఇంకా రాలేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని రీట్రైవ్‌ చేయడానికి నిపుణులు శ్రమిస్తున్నారు. త్వరలోనే వీటి నుంచి సమాచారాన్ని సంగ్రహిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తన 
అశోక్‌ వస్తారన్న సమాచారంతో గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌కు వెళ్లిన మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోపలికి అనుమతించేది లేదని మీడియాతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడే బైఠాయించారు. అటుగా వస్తున్న డీఎస్పీ రోహిణి ప్రియదర్శిని వాహనాన్ని అడ్డగించారు. అనంతరం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌కు దీనిపై ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు