ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి

20 Aug, 2018 13:41 IST|Sakshi
కొమ్ముగూడెంలో శ్రీనివాస్‌ ఇంటి వద్ద శోకసముద్రంలో కుటుంబసభ్యులు, కుంజం శ్రీనివాస్‌ (ఫైల్‌)

పోలవరం రూరల్‌: ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన కుమారుడు పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలో మృతదేహంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలవరం మండలం ఇటుకలకోట గ్రామంలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంజం శ్రీనివాస్‌ (18) 9వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 15న బుధవారం సాయంత్రం శ్రీనివాస్‌ వసతి గృహం నుంచి కొమ్ముగూడెం ఇంటికి వెళ్లాడు. గురువారం శ్రీనివాసరావును తండ్రి కుంజం రాజు ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు అప్పగించారని తల్లి దుర్గ తెలిపింది. సెలవుల్లో తమ కుమారుడు ఇంటికి వస్తాడని, శనివారం సాయంత్రం రాకపోవడంతో ఆశ్రమ పాఠశాలకు వెళ్లి వార్డెన్‌ను, ఉపాధ్యాయులను అడిగినా సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తల్లి ఆరోపించింది.

దీంతో పోలవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా గోపాలపురం మండలంలోని పోలవరం కుడికాలువలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్టు చెప్పారన్నారు. మృతదేహాన్ని పరిశీలించగా అది తమ కుమారుడిదని బోరుమన్నారు. వసతి గృహంలో విద్యార్థి ఉన్నాడా లేదా అన్న విషయాన్ని కూడా రెండు రోజులుగా వార్డెన్,  ఉపాధ్యాయులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కుమారుడిని కోల్పోయామన్నారు. వస తి గృహానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కుమారుడికే ఇటువంటి పరిస్థితి ఉంటే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. శ్రీనివాస్‌ కాలువలో పడి ఎలా మృతిచెందాడో తెలియని పరిస్థితి అని కుటుంబ సభ్యులు, బంధువులు పేర్కొంటున్నారు. దుర్గమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్‌ చిన్న కుమారుడు శ్రీనివాస్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

మృతదేహం వివరాలు లభ్యం
గోపాలపురం: గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో పోలవరం కుడి ప్రధాన కాలువలో శనివారం కొట్టుకొచ్చిన మృతదేహం వివరాల లభ్యమైనట్టు ఎస్సై ఎం.జయబాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. మృతుడు పోలవరం మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కుంచెం శ్రీనివాస్‌ (18)గా గుర్తించినట్టు చెప్పారు. మృతుడు  9వ తరగతి చదువుతున్నాడని ఈనెల 16న పాఠశాలకు వెళుతూ ప్రమాదవశాత్తు పోలవరం కుడి కాలువలో జారిపడి మృతిచెందినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు