మంచాల ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

23 Nov, 2019 04:18 IST|Sakshi
కాలిన గాయాలతో ఏఎస్‌ఐ నర్సింహ

బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ముందున్న వాటర్‌ట్యాంక్‌ ఎక్కి నిప్పంటించుకున్న నర్సింహ

బాలాపూర్‌ నుంచి మంచాల పోలీస్‌స్టేషన్‌కు ఇటీవలే బదిలీ

ఇన్‌స్పెక్టర్‌ వేధింపులే కారణం అంటున్న ఏఎస్‌ఐ కుమారుడు

పహాడీషరీఫ్‌: పోలీస్‌స్టేషన్‌ ముందు ఓ ఏఎస్‌ఐ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకోవడం బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కె.నర్సింహ ఏడాదిన్నర క్రితం నుంచి ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగైదు రోజుల క్రితం ఆయనను బదిలీ చేస్తూ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ నెల 21న మంచాల పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. శుక్రవారం మధ్యా హ్నం 3 గంటల సమయంలో బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ముందున్న వాటర్‌ట్యాంక్‌ వద్దకు యూనిఫారంలో వచ్చిన ఆయన ట్యాంక్‌పైకి ఎక్కారు. ఇది గమనించిన పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఆయనను కాపాడేందుకు పైకి ఎక్కారు. ఈలోపే ఆయన ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. పైకి చేరుకున్న సిబ్బంది ఆయనను కిందికి దించి చికిత్స నిమిత్తం సంతోష్‌నగర్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. 35 శాతం కాలిన గాయాలతో ఆయన చికిత్స పొందుతున్నారు.

వివాదానికి కారణమైన వివాహ విందు.. 
నర్సింహ బంధువుల వివాహం బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఈ నెల 15న జరిగింది. విందుకు నర్సింహ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. విందుకు బాలాపూర్‌ ఠాణా కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్లారు. ఈ సమయంలోనే ఏఎస్‌ఐకి, సదరు కానిస్టేబుళ్ల నడుమ వివాదం నెలకొంది. దీనికి సంబంధించిన ఆధారాలను రాచకొండ సీపీ అధికార గ్రూప్‌లో కానిస్టేబుళ్లు పోస్ట్‌ చేశారు. దీనిపై స్పందించిన సీపీ.. ఏఎస్‌ఐని మరుసటిరోజే బదిలీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆ కానిస్టేబుళ్లు డబ్బులు డిమాండ్‌ చేశారంటూ బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులుకి ఏఎస్‌ఐ కుమారుడు సాయికిరణ్‌ శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్‌స్పెక్టర్‌ సైదులు వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సాయికిరణ్‌ ఆరోపించాడు.

ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు.. 
ఈ ఉదంతాన్ని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సీరియస్‌గా తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహను పరామర్శించి.. కుటుంబీకుల్ని ఓదార్చారు. అనంతరం ఇన్‌స్పెక్టర్‌ సైదులుతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ దశరథ్‌ను హెడ్‌క్వార్టర్‌కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా ఎల్బీ నగర్‌ డీసీపీని ఆదేశించారు.

గతంలో సైదులు ఆత్మహత్యాయత్నం.. 
బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.సైదులు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా ఉన్న సమయంలో ఆయనపై అవి నీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేశారు. దీంతో సైదులు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ వద్ద తనపై విచారణ చేయకుండా చర్యలు తీసుకున్నారని హల్‌చల్‌ చేశారు. విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. సైదులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన సోదరుడు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా