బాలాపూర్‌ సీఐపై బదిలీ వేటు

22 Nov, 2019 16:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బాలాపూర్‌ పోలీస్ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎస్సై నరసింహను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరామర్శించారు. ప్రస్తుతం నరసింహ అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరసింహకు అపోలో వైద్యులు మెరుగైన చికిత్స అందిసున్నారని తెలిపారు. అయితే సీఐ సైదులు తనపై తప్పుడు రిపోర్టు ఇచ్చాడని నరసింహ ఆరోపించిన వ్యాఖ్యలను మేము పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు నరసింహ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయితే బాలాపూర్‌ సీఐ సైదులు, కానిస్టేబుల్‌ దశరథ్‌లను బదిలీ చేసి సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశామని తెలిపారు. తదుపరి విచారణలో వీరిద్దరి ప్రమేయం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.

నగరంలోని బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒక కేసు విషయంలో తనకు సంబంధం లేకున్నా ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చాడని నరసింహ పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో 30 శాతం కాలిన గాయాలతో ఉన్న నరసింహను అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. 

వివరాలు..  ఇటీవల బాలాపూర్‌ సీఐ తనను వేధిస్తున్నాడంటూ అదే స్టేషన్‌లో ఏఎస్సై గా పనిచేస్తున్న నరసింహ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని ఫిర్యాదును పట్టించుకోకుండా నరసింహను బాలాపూర్‌ నుంచి మంచాలకు ట్రాన్స్పర్‌ చేశారు. తన తప్పు లేకున్నా సీఐ ఇచ్చిన తప్పుడు రిపోర్టుతో తనను అక్రమంగా బదిలీ చేశారని మనస్థాపం చెందాడు. దీంతో శుక్రవారం నరసింహ పెట్రోల్‌ బాటిల్‌తో బాలాపూర్‌ పీఎస్‌కు చేరుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా