మాజీ పోలీస్‌.. 8 రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌

24 Jun, 2020 05:08 IST|Sakshi

వలపన్ని పట్టుకున్న హరియాణా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ

హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అంగీకరించిన వైనం!

అధికారిక సమాచారం కోసం మన పోలీసుల ఎదురుచూపు

సాక్షి, హైదరాబాద్‌: అతడి పేరు అస్లుప్‌.. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్సై. తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు దారితప్పి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి వరుస నేరాలు చేస్తూ ఎనిమిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారాడు. గత వారం హరియాణాకు చెందిన క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (సీఐఏ) ఇతడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలో.. హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు అస్లుప్‌ అంగీకరించాడు. దీనిపై తమకు అధికారిక సమాచారం లేదని ఇక్కడి పోలీసులు చెబుతున్నారు.

ఎస్సై దొంగగా మారాడిలా..
హరియాణాలోని నుహ్‌ జిల్లాకు చెందిన అస్లుప్‌ పదేళ్ల క్రితం ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్‌–ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. జల్సాలకు అలవాటుపడి తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు పెడదారి పట్టాడు. కొందరు నేరగాళ్లకు సహకరిస్తూ వారితో చోరీలు, దోపిడీలు చేయించేవాడు. చోరీ సొత్తును విక్రయించడానికి సహకరిస్తూ భారీగా కమీషన్లు తీసుకునేవాడు. ఆరేళ్ల క్రితం ఇది గుర్తించిన ఢిల్లీ పోలీసులు అస్లుప్‌ను అరెస్టు చేశారు. దీంతో ఉద్యోగం కోల్పోయిన అతడు జైలు నుంచి బయటకొచ్చాక నేరాలు చేయడాన్నే వృత్తిగా చేసుకున్నాడు. ఏటీఎంల్లో చోరీలు, హత్యాయత్నాలు, దాడులు, దొంగతనాలు చేయడంలో ఆరితేరాడు. పోలీసులకు చిక్కకుండా, తన ఉనికి బయటపడకుండా ఈ నేరాలన్నీ ఒంటరిగానే చేసేవాడు. హైదరాబాద్‌తో పాటు హరియాణా, కేరళ, మహారాష్ట్ర, కోల్‌కతా, గుజరాత్, రాజస్తాన్, ఒడిశాలోని పలు నగరాల్లో మొత్తం 24 నేరాలు చేసిన ఇతడు మోస్ట్‌ వాంటెట్‌గా మారాడు. హరియాణా పోలీసులు రూ.50 వేల రివార్డు సైతం ప్రకటించారు.

హైదరాబాద్‌లోనూ అస్లుప్‌ నేరాలు?
హరియాణాకు చెందిన సీఐఏ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి అస్లుప్‌పై నిఘా ఉంచింది. గత శుక్రవారం.. ఢిల్లీ–అల్వాల్‌ హైవేపై ఉన్న కేఎంపీ రోడ్‌లోని రేవాసన్‌ హోటల్‌ వద్ద ఇతడిని వలపన్ని పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో హైదరాబాద్‌లోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అస్లుప్‌ను కోర్టులో హాజరుపరిచిన సీఐఏ తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకుంది. అనంతరం ఇతడికి సంబంధించి కేసులున్న ఇతర నగరాల పోలీసులకు అధికారిక సమాచారం ఇవ్వనున్నారు. నగరానికి చెందిన ఓ పోలీసు అధికారి దీనిపై మాట్లాడుతూ... ‘అస్లుప్‌ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లలో ఎక్కడెక్కడ నేరాలు చేశాడనేది ఇప్పుడే చెప్పలేం. హరియాణా పోలీసుల నుంచి అధికారిక సమాచారం అందితే స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఎదురు చూడాల్సిందే’అని చెప్పారు.  

మరిన్ని వార్తలు