గొర్రెల కాపరిపై హత్యాయత్నం

4 Jun, 2018 14:39 IST|Sakshi
చికిత్స పొందుతున్న బాధితుడు రాజు

గాయాలతో ఆస్పత్రి పాలైన బాధితుడు

కుటుంబ కలహాలే కారణమా?

రఘునాథపల్లి : గొర్రెలు మేపుతున్న ఓ కాపరిపై గుర్తు తెలియని వ్యక్తులు లిక్విడ్‌ చల్లి హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని అశ్వరావుపల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అశ్వరావుపల్లి శివారులోని వ్యవసాయ పొలాల వద్ద గ్రామానికి చెందిన గాజుల రాజు అనే గొర్రెల కాపరి గొర్రెలు మేపుతున్నాడు.

మధ్యాహ్నం 2.30 నిమిషాల  సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ వెంట ప్లాస్టిక్‌ బాటిల్‌లో తెచ్చుకున్న లిక్విడ్‌ (ద్రావకం) చల్లారు. నెత్తికి రుమాలు చుట్టుకోవడంతో లిక్విడ్‌ మొఖంపై ఎక్కువగా పడలేదు. కళ్లలో పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.

దీంతో పాటు రాజు గొంతు నులిమేందుకు ఆ వ్యక్తులు ప్రయత్నించగా కొద్ది దూరంలో ఉన్న వేరొక గొర్ల కాపరి గుర్తించి అరవడంతో ఆగంతకులు పారిపోయారు. గాయాలతో రోదిస్తున్న రాజును స్థానికులు జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రంజిత్‌రావు ఆసుపత్రికి చేరుకొని బాధితుడి నుంచి వివరాలు సేకరించి విచారణ కొనసాగిస్తున్నారు.

 పట్టపగలే అఘాయిత్యం..

గొర్రెలు మేపుతున్న రాజుపై పట్టపగలే అఘాయిత్యానికి పాల్పడటం  గ్రామంలో కలకలం రేపింది. కొద్ది దూరంలో ద్విచక్రవాహనం నిలిపిన దుండగులు కాలినడకన రాజు వద్దకు చేరుకున్నారు. దుండగులు వెంట తెచ్చుకున్న  లిక్విడ్‌ యాసిడ్‌గా బావించారా ..?

చల్లిన వెంటనే ఒంటిపై గాయాలు కాకపోవడంతో గొంతు నులిపి హత్యచేసేందుకు యత్నించడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు గ్రామస్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.  రాజుకు తొమ్మిది సంవత్సరాల క్రితం అలేరు మండలానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. భార్యభర్తల మధ్య ఏర్పడిన వివాదాలు, పలు కారణాలతో రెండేళ్ల క్రితం దూరమయ్యారు.

ఆరు నెలల క్రితం అదే మండలంలోని కొలనుపాకకు చెందిన జ్యోతితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలతో దాడి జరిగిందా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడిపై చల్లింది యాసిడా ..? ఇతర ఏ లిక్విడ్‌ అన్నది ఆరా తీస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు. జనగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును ఎంపీపీ దాసరి అనిత పరామర్శించారు.

మరిన్ని వార్తలు