సహజీవనానికి నిరాకరించిందని నడిరోడ్డుపైనే..

6 Sep, 2019 10:25 IST|Sakshi
హత్యాయత్నానికి వినియోగించిన కొడవలి ఇన్‌సెట్‌..నాగేశ్వరరావు

సాక్షి, గుణదల(విజయవాడ): ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి  మొగల్రాజపురం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొగల్రాజపురం కొండ ప్రాంతానికి చెందిన నాగులపల్లి రామలక్ష్మి(45) ఇళ్లలో పనులు చేసుకుంటూ బతుకుతోంది. భర్తలేని కారణంగా పిల్లలతో జీవనంసాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు(48) మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వద్ద రోడ్డు పక్కన చెప్పులు కుడుతుంటాడు. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. భర్తలేని రామలక్ష్మిపై కన్నేసిన నాగేశ్వరరావు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమెను తన కోరిక తీర్చాలని వెంటపడ సాగాడు. ఆమె నిరాకరించడంతో తనతో సహజీవనం చేయాలని బలవంతం చేస్తున్నాడు. తనకు పిల్లలు ఉన్నారని, వారి కోసమే కష్టపడి బతుకుతున్నానని ఆమె చెప్పినా ఎంతకీ తన దారిలోకి రాకపోవడంతో ఆమెను అంతం చేయాలని ప్లాన్‌ వేశాడు. 

నడిరోడ్డుపై దాడికి..
మొగల్రాజపురం పాత ఐదో నంబరు రూటు రోడ్డులో పనికి వెళ్లిన ఆమెను వెంబడించాడు. ఓ ఇంట్లో పని ముగించుకుని వస్తున్న రామలక్ష్మిని అడ్డగించి నడిరోడ్డుపై దాడికి దిగాడు. విచక్షణా రహతంగా కొట్టడంతో ఆమె కింద పడిపోయింది. అతడి వద్ద ఉన్న కొడవలితో పీక కోయడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఈ గొడవను చూస్తున్న స్థానికులు అడ్డుపడి నాగేశ్వరరావును పక్కకు లాగారు. కత్తి గాటుకు గొంతు పాక్షికంగా తెగటంతో రామలక్ష్మి రక్తపు మడుగులో పడిఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు ప్రాణాపాయస్థితి లేదని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసేందుకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటికే ఉన్నదంతా ఉడ్చేశాడు..
కామాంధుడైన నాగేశ్వరరావుకు అమాయకులైన మహిళలను లైంగికంగా వేధించడమే పనిగా పెట్టుకున్నాడని కొండ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మహిళల వెంట పడి వేధిస్తూ వారి వద్ద లక్షలాది రూపాయలు దిగ మింగాడని స్థానికులు చెబుతున్నారు. చివరికి మహిళలను హత్య చేసేందుకు కూడా వెనుకాడక బరితెగించాడని నాగేశ్వరరావుకు దేహశుద్ధి చేశారు.  

మరిన్ని వార్తలు