ఘోరం..

9 Nov, 2018 07:49 IST|Sakshi
వివాహ వేడుకల్లో కుటుంబ సభ్యులతో రవికుమార్‌

కారు ఢీకొని బీఆర్‌ఏయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

వర్సిటీ సమీపంలోనే ఘటన

శ్రీకాకుళం , ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం విద్యావిభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ యడ్ల రవికుమార్‌ (68) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వర్సిటీలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవికుమార్‌ గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వర్సిటీ ముందు ఉన్న 16వ నంబర్‌జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న కారు వెనుక నుంచి ఆయన్ని ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన రవికుమార్‌ను 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు రిఫర్‌ చేశారు. అయితే తోటి సిబ్బంది శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 7.30 గంటల సమయంలో కన్నుమూశారు. రవికుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

రవికుమార్‌ గురించి..
రవికుమార్‌ బీఆర్‌ఏయూలోని విద్యా విభాగంలో ప్రత్యేక బీఈడీ మెంటల్లీరిటార్డ్‌ ప్రత్యేక బీఈడీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈయన స్వగ్రామం లావేరు మండలం అప్పాపురం. విజయనగరం ఎంఆర్‌ కళాశాలలో సీనియర్‌ ఆధ్యాపకునిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. 2009లో బీఆర్‌ఏయూలో ప్రత్యేక బీఎడ్‌ కోర్సు ప్రారంభించిన సమయంలో ఇక్కడ విధుల్లో చేరారు. ప్రత్యేక బీఎడ్‌ కోర్సు బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఈయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గతంలో అమెరికాలో సాప్ట్‌వేరు ఇంజినీర్లుగా పని చేసిన పిల్లలు ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. రవికుమార్‌ ఆకస్మిక మరణాన్ని వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. 68 ఏళ్ల వయస్సులో కూడా బోధన విషయంలో యువ ఫ్యాకల్టీ సభ్యులతో పోటీ పడేవారు. ఉత్సాహంగా ఉంటూ వర్సిటీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు. రోజూ స్వగ్రామం అప్పాపురం నుంచి రాక పోకలు సాగిస్తూ ఉండేవారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు