పెద్దల కోసమే విద్యార్ధినుల్ని ప్రేరేపించి..

9 Nov, 2018 10:12 IST|Sakshi
నిర్మలాదేవి

వాంగ్మూలం సీబీసీఐడీ సృష్టి

నిర్మలా దేవి కేసులో మురుగన్‌ న్యాయవాది

పెద్దల్ని రక్షించేందుకు బలి పశువులుగా ఇద్దరు

నిర్దోషులం.. విడుదల చేయండి

కోర్టులో నిర్మలా దేవి అండ్‌ బృందం పిటిషన్‌

సాక్షి, చెన్నై : విద్యార్ధినుల్ని ప్రేరేపించి, ఒత్తిడి తెచ్చి మరీ తప్పుడు మార్గంలో పయనింపచేయడానికి ప్రొఫెసర్‌ నిర్మలాదేవి చేసిన ప్రయత్నానికి సంబంధించి రోజుకో రూపంలో వెలువుడుతున్న వాంగ్మూలం అంతా కట్టు కథ అని మురుగన్‌ న్యాయవాది సురేష్‌ స్పష్టంచేశారు. సీబీసీఐడీ ఓ కట్టుకథను సృష్టించి, దానిని చార్జ్‌ షీట్‌గా పేర్కొంటూ, మీడియాను తప్పుదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము నిర్ధోషులం అని, తమను ఈ కేసు నుంచి విడుదల చేయాలని కోరుతూ నిర్మలాదేవి అండ్‌ బృందం విరుదునగర్‌ కోర్టును గురువారం ఆశ్రయించింది.

విరుదునగర్‌ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగుర్‌ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినుల్ని లైంగిక ప్రేరణకు గురిచేయడానికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి సాగించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎవరో పెద్దల కోసమే ఆమె విద్యార్థినుల మీద ఒత్తిడి తెచ్చినట్టు తొలుత ప్రచారం సాగింది. ఈ వ్యవహారంలో పెద్దలు అనేకమంది ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణలతో కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈ కేసులో నిర్మలాదేవితో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్ప స్వామిలను అరెస్టుచేశారు. ఈకేసును విచారిస్తున్న సీబీసీఐడీ కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చార్జ్‌షీట్, విచారణలో వారు ఇచ్చిన వాంగ్మూలం మేరకు వివరాలు అంటూ సరికొత్త తరహా కథనాలు మీడియాల్లో వెలువడుతున్నాయి. ఈ కథనాలన్నీ సీబీసీఐడీ సృష్టిగా పేర్కొంటూ, మురుగన్‌ తరపు న్యాయవాది సురేష్‌ మీడియా ముందుకు వచ్చారు.

బలి పశువులుగా..
కోర్టు విచారణకు హాజరవుతూ వస్తున్న నిర్మలాదేవి, మురుగన్, కరుప్పస్వామి తాము వాంగ్మూలం ఇచ్చినట్టు ఏ సందర్భంలోనూ పేర్కొనలేదని వివరించారు. ఈ కేసులో ఎవర్నో పెద్దల్ని రక్షించే ప్రయత్నంలో ఇద్దర్ని బలి పశువులు చేయడానికి సీబీసీఐడీ సిద్ధం అయిందని ఆరోపించారు. ఆ ఇద్దరే మురుగన్, కరుప్పు స్వామిలగా పేర్కొన్నారు. ఈ ఇద్దర్నీ కేసులో ఇరికించేందుకు రోజుకో కథనం మీడియాల్లోకి ఎక్కుతోందని ఆరోపించారు. ఇది సీబీసీఐడీ సృష్టించిన కట్టు కథ అని, ఇది తమ కేసుకు ఉపయోగపడే రీతిలో మీడియాను సీబీసీఐడీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ కట్టు కథను నమ్మవద్దు అని సూచించారు. కాగా, ఈ కేసులో తాము నిర్ధోషులం అని, తాము తప్పుచేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, అయితే, తమను బలవంతంగా మదురై కారాగారంలో బంధించారని, తమ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని, లేదా బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిర్మలాదేవి, మురుగన్, కరుప్పుస్వామి విరుదునగర్‌ కోర్టును ఆశ్రయించడం గమనార్హం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు