పట్టపగలే జ్యోతిష్యుడి దారుణహత్య

25 Dec, 2018 10:57 IST|Sakshi
జ్యోతిష్యుడి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

నింపాదిగా కరపత్రాలు పంపిణీ చేసి వెళ్లిన హంతకుడు

తిరుప్పూర్‌లో కలకలం..

తమిళనాడు, సేలం: తిరుప్పూర్‌లో సోమవారం మిట్ట మధ్యాహ్నం ఓ జ్యోతిష్యుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు ఓ హంతకుడు. అనంతరం నింపాదిగా అక్కడ గుమికూడిన వారికి హత్యకు గల కారణాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసి వెళ్లాడు. వివరాలు.. తిరుప్పూర్‌ నగరంలో వెల్లివిళా పార్కు ఉంది. ఇక్కడ అనేక దుకాణలు ఉండడం వల్ల అన్ని వేళలా జనం రద్దీ ఉంటుంది. ఇక్కడ సోమవారం మధ్యాహ్నం కత్తితో వచ్చిన ఒక వ్యక్తి అటువైపుగా నడిచి వెళుతున్న ఒక జ్యోతిష్యుడిని పొడిచి దారుణంగా హత్య చేశాడు. జ్యోతిష్యుడు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోగా, ఆ హంతకుడు ఒక చేతిలో కత్తితో.. మరో చేతిలో తాను తీసుకు వచ్చిన కరపత్రాలను అక్కడ గుమికూడిన వారికి, దుకాణాల వారికి నింపాదిగా పంచి పెట్టి వెళ్లిపోయాడు.

పోలీసుల విచారణ..
ఘటనపై సమాచారం అందుకున్న తిరుప్పూర్‌ పోలీసులు అక్కడికి వెళ్లి, జ్యోతిష్యుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత హంతకుడు పంచిపెట్టిన కరపత్రాలను పరిశీలించారు. అందులో.. హత్యకు గురైన జ్యోతిష్యుడు తిరుప్పూర్‌ మంగళం భారతి పూదూర్‌కు చెందిన రమేష్‌ (అలియాస్‌ కుమార్‌). ఇతను గత 14 ఏళ్లకు పైగా కుమరన్‌ పార్కు వద్ద కూర్చుని జోష్యం చెబుతున్నాడు. అంతటితో ఆగకుండా అక్కడికి వచ్చే ప్రేమికులు, అమ్మాయిలను పిలిచి చేతులు పట్టుకుని, మాయమాటలు చెప్పి తన వలలో వేసుకుని వ్యభిచార రొంపిలోకి దించడం, అమాయకులైన అమ్మాయిలను లైం గికంగా వేధించడం వంటివి చేస్తున్నాడు. ఇతనికి ప్రముఖ రాజకీయ నేతలు అండగా ఉన్నారు. ఇతడి చెరలో గత రెండేళ్లుగా ఒక మహిళ చిక్కుకుని ఇబ్బందులు పడుతోంది. ఈమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ మహిళను రక్షించాలి. ఇటువంటి దుర్మార్గపు జ్యోతిష్కుడు బతికి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే హతమారుస్తున్నా అని రాసి ఉంది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు