జాతకాల పేరుతో యువతి నుంచి రూ.లక్షలు దోపిడీ 

8 Dec, 2019 11:54 IST|Sakshi

 బయటకు చెపితే చంపేస్తానంటూ బెదిరింపులు  

సాక్షి, లబ్బీపేట (విజయవాడ తూర్పు): జాతకంలో దోషాలు ఉండటంతోనే ఇంకా వివాహం కాలేదని, పూజలు చేసి శాంతి చేస్తే కోరికలు సిద్ధించి పెళ్లి జరుగుతుందని ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమె నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్న ఘరానా మోసగాడిపై కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ సత్యానంతం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరిమి సాయిప్రియాంక (25) తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి అయోధ్యనగర్‌లో నివాసముంటోంది. ఆమెకు వివాహం కాకపోవడంతో జాతకంలో దోషాలు ఉండి ఉంటాయని, జ్యోతిష్యుడికి చూపించి పరిహారం చేయించుకోవాలని తెలిసిన వారు సూచించారు.

దీంతో కృష్ణలంక పాత పోస్టాఫీస్‌ రోడ్డు బియ్యపు కొట్ల బజార్‌లో ఉండే శ్రీశారద సనత్‌చంద్ర అనే జ్యోతిష్యుడిని కలుసుకుని తన సమస్య చెప్పుకుంది. ఆమె జాతకాన్ని పరిశీలించిన ఆయన ఎన్నో దోషాలు ఉన్నాయని, వాటికి ప్రత్యేక పూజలు చేస్తే తొలగిపోతాయని నమ్మబలకడంతో సరేనంది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌ 23న ఆమె నుంచి రూ.50 వేలు నగదు తీసుకుని కొన్ని పూజలు చేశాడు. తర్వాత తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని అమ్మవారి గుడిలో ప్రత్యేకంగా పూజలు చెయ్యాలంటూ రూ.2.85 లక్షలు తీసుకుని ఆమెను అక్కడకు తీసుకెళ్లాడు. అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించి పంపించేశాడు. అంతటితో ఆగకుండా ముగ్గురు ముత్తైదువలకు దానం చెయ్యాలని, అప్పుడే గ్రహాలు అనుగ్రహిస్తాయంటూ తన కార్యాలయంలో పనిచేసే ఓ మహిళతో పాటు వారి కుటుంబ సభ్యుల్లోని మరో ఇద్దరు మహిళలకు రూ.70 వేలు ఇప్పించాడు.

వాటితో పాటు మరో పూజ చెయ్యాలని అందుకు రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పడంతో యువతి తన వద్ద డబ్బులు లేవని చెప్పింది. ఆ పూజ చెయ్యకపోతే ఇప్పటివరకు చేసిందంతా వ్యర్థమవుతుందని, తనకు తెలిసిన వారి నుంచి డబ్బులు అప్పు ఇప్పిస్తానంటూ ఎస్‌బీఐ బ్యాంకు చెక్కులు, ప్రాంసరీ నోట్‌లు రాయించుకుని తీసుకున్నాడు. అప్పటి నుంచి ఎటువంటి పూజలు చేయ్యకుండా ముఖం చాటేశాడు. ఆమె ఫోన్‌ చేస్తే అసభ్యకరంగా తిడుతూ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగటంతో ఆమె భయాందోళనలకు గురై శనివారం కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన వారు దర్యాప్తు చేపట్టారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా