ఏటీఎం కార్డు స్కిమ్మింగ్‌

10 Mar, 2020 07:49 IST|Sakshi
పట్టుబడ్డ నిందితులు ,స్వాధీనం చేసుకున్న నకిలీ ఏటీఎం కార్డులు, పాస్‌పోర్టులు

 ఇద్దరు విదేశీయులు సహా  

ముగ్గురు నిందితులు అరెస్టు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ఏటీఎం కార్డు స్కిమ్మింగ్‌ చేస్తున్న ఇద్దరు విదేశీయులతో కలిపి ముగ్గురు నిందితులను రామనగర జిల్లా హారోహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియాకు చెందిన అలూక సాండ్రా ఒరెవ్హా (25), హెన్రి అఖ్యుటైమెన్‌ (25), మహారాష్ట్రకు చెందిన విజయ్‌ థోమన్‌ (30) పట్టుబడ్డ నిందితులు. నిందితుల నుండి నైజీరియా పాస్‌పోర్టులు, నకిలీ ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్‌ ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.  ఫిబ్రవరి 2న కనకపుర తాలూకా బూదగుప్పె గ్రామంలోని ఇండియా వన్‌ ఏటీఎం సెంటర్‌లో గీత అనే మహిళ ఏటీఎం కార్డు ఉపయోగించి డబ్బులు డ్రా చేసుకున్నారు. తరువాత ఇదే ఏటీఎంలో ఫిబ్రవరి 9న రూ.49 వేలు డ్రా చేసినట్టు గీత మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో బాధిత మహిళ సీఈఎన్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సీఈఎన్‌ పోలీసులు డీసీఐబీ, హారోహళ్లి పోలీసులతో కలిసి కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

గత నెల ఏటీఎం స్కిమ్మింగ్‌ కేసులో అరెస్టయ్యి జైలులో ఉన్న ముగ్గురు నైజీరియా వ్యక్తులను విడిపించడానికి డబ్బులు అవసరమై తాము మళ్లీ ఏటీఎం స్కిమ్మింగ్‌కు పాల్పడ్డట్టు నిందితులు తెలిపారని పోలీసులు చెప్పారు. నిందితులపై రామనగరలో 44, బెంగళూరులో 6, చిత్రదుర్గ జిల్లాలో 4 కేసులు ఇవే కేసులు నమోదయ్యాయి.  

మరిన్ని వార్తలు