వీడిన ఏటీఎం ధ్వంసం కేసు మిస్టరీ

3 Nov, 2017 08:25 IST|Sakshi

ముగ్గురు అంతర్‌ రాష్ట్ర దొంగల అరెస్టు

లారీ, బొలేరో, ద్విచక్ర వాహనాలు స్వాధీనం

నిందితులు హర్యానా వాసులు

కేసును ఛేదించిన సీఐ, ఎస్‌ఐలకు రివార్డులు ప్రకటించిన డీఎస్పీ

మదనపల్లె క్రైం : రెండు నెలల క్రితం కలకలం సృష్టిం చిన ఎస్‌బీఐ ఏటీఎం ధ్వంసం చేసి రూ.22 లక్షల నగదు చోరీని కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఇందుకు కారణమైన ముఠాలోని ముగ్గురు అంతర్‌ రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి లారీ, బొలేరో, ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఎం.చిదానందరెడ్డి స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్ల డించారు. హర్యానా రాష్ట్రం మేవార్డు జిల్లాకు చెందిన హసన్‌ఖాన్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన చెల్లెలి పెళ్లికి రూ.30 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు మా ర్గం చూపాలని స్నేహితుడు లతీఫ్‌ను అడిగాడు. లతీఫ్‌ అతన్ని హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఏటీఎం చోరీలకు పాల్పడే అమస్, సమూన్, కల్లు వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశాడు.

లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ..
ఈ ముఠా సభ్యులు లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ దారి దోపిడీలు, చోరీలు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించేవారు. ఇటీవల హర్యానాకు చెందిన ఓ లారీ యజమాని ఆదేశాల మేరకు ఏడుగురు కలిసి బెంగళూరుకు లారీలో మందులు తీసుకువచ్చారు. అక్కడి నుంచి బ్రోకర్‌ సమాచారంతో బొప్పాయి పండ్లను బెంగళూరుకు తీసుకెళ్లేందుకు కలికిరి వచ్చారు. అక్కడ ఒక రోజు ఉండి తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లలోని గూగుల్‌ మ్యాప్‌ల ద్వారా ఏటీఎంలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సెక్యూరిటీలేని ఏటీఎంల వివరాలను తెలుసుకున్నారు.

పక్కా పథకంతో చోరీ
మదనపల్లె బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె తండాలో ఉన్న ఏటీఎంలో చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. చోరీ కోసం ఆయుధాలు సమకూర్చుకుని కలికిరి నుంచి మదనపల్లెకు బస్సులో వస్తూ చింతపర్తి వద్ద ముగ్గురు వ్యక్తులు దిగారు. అక్కడ ఓ ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి అదే వాహనంలో మదనపల్లెకు చేరుకున్నారు. బస్సులో ముందుగా వచ్చిన ముగ్గురు, ద్విచక్ర వాహనంలో వచ్చిన ముగ్గురు కలిసి ఎస్టేట్‌లో బొలేరో వాహనం చోరీ చేశారు. వాహనాల్లో తిరుగుతూ మదనపల్లె పట్టణంలో రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం సెప్టంబర్‌ 2 బక్రీద్‌ పండుగ రోజు వేకువజామున గ్యాస్‌ కట్టర్లను వినియోగించి నక్కలదిన్నె తండా వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.22.24 లక్షల నగదును చోరీ చేశారు. అనంతరం ములకలచెరువు రోడుల్డోని చీకటిమాను పల్లె వద్ద వాహనాలను వదిలిపెట్టి పరారయ్యారు.

దారి దోపిడీ చేయబోయి..
ఘటనపై ఒకటో పట్టణ సీఐ నిరంజన్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే దుండగులు రొంపిచెర్ల వద్ద దారి దోపిడీకి ప్రయత్నించారు. వారిలో ముగ్గురిని పీలేరు సీఐ మహేశ్వర్‌ అదుపులోకి తీసుకున్నారు. నలుగురు పరారయ్యారు. విచారణలో వారు హర్యానా రాష్ట్రం మేవార్డుకు చెందిన ముస్తాక్‌ఖాన్, హసన్‌ఖాన్, యాకుబ్‌గా తేలింది. పలు నేరాలు, చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారు. యాకుబ్‌ గాయపడడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తప్పించుకున్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సీఐలు మహేశ్వర్, నిరంజన్‌కుమార్‌రెడ్డి, రుషికేశవ్, ఎస్‌ఐలు రహీమ్‌వుల్లా, దస్తగిరి, ఈశ్వర్‌కు డీఎస్పీ రివార్డులు ప్రకటించారు.

మరిన్ని వార్తలు