అకౌంట్‌లో నగదు మాయం

2 May, 2019 13:17 IST|Sakshi
బ్యాంక్‌ స్టేట్‌మెంట్, ఏటీఎం కార్డును చూపుతున్న దృశ్యం

కార్డు ఇక్కడ.. డబ్బు డ్రా చేసింది వైజాగ్‌లో  

ఆత్మకూరు: ఏటీఎం కార్డు తన వద్ద ఉండగా ఖాతాలోని నగదు రూ.40 వేలు డ్రా చేసినట్లుగా ఫోన్‌కు సమాచారం అందడంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం మున్సిపల్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. మున్సిపల్‌ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బేల్దారి పనులు చేసే బడే వీరరాఘవులురెడ్డికి స్టేట్‌ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అతని బ్యాంకు ఖాతా నుంచి తొలుత రూ.20 వేలు ఏటీఎంలో డ్రా చేసినట్లు, అనంతరం కొద్దిసేపటికే మరో రూ.20 వేలు వేరొకరి ఖాతాలోకి బదిలీ అయినట్లు ఫోన్‌ ద్వారా సమాచారం అందింది. ఆలస్యంగా చూసుకున్న వీరరాఘవులురెడ్డి బ్యాంక్‌ అధికారులను సంప్రదించగా అతని ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.40 వేలు (ఏటీఎం ద్వారా, బదిలీ రూపంలో) వైజాగ్‌లో డ్రా చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.

నగదు ఆ ఖాతా నుంచి కొద్దినిమిషాలకే ఛత్తీస్‌ఘడ్‌లోని మరొకరి బ్యాంక్‌ ఖాతాలోకి బదిలీ అయినట్లు బ్యాంక్‌ అధికారులు గుర్తించి బాధితుడికి సమాచారం చెప్పారు. ఏటీఎం కార్డు తన వద్ద ఉండగానే తన ప్రమేయం లేకుండా ఖాతా నుంచి నగదు ఎలా మాయమవుతుందని బాధితుడు ప్రశ్నించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని బ్యాంకు అధికారులు వారికి తెలిపారు. దీంతో బుధవారం ఎస్సై పి.నరేష్‌కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ నేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తామని ఎస్సై వెల్లడించారు. 

మరిన్ని వార్తలు