పట్టుబడిన దొంగ...

2 Apr, 2018 12:17 IST|Sakshi
నిందితుడితో డీఎస్పీ తదితరులు

14 దొంగతనాల్లో రూ 3.2 లక్షలఅపహరణ

నిందితుడి నుంచి రూ. 1.89 లక్షలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఏవీ రమణ

నెల్లిమర్ల:జిల్లా వ్యాప్తంగా ఏటీఎంల వద్ద దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని నెల్లిమర్ల పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఏడాది కాలంలో 14 దొంగతనాల్లో రూ 3.2 లక్షల నగదు అపహరించగా సదరు నిందితుడి నుంచి రూ. 1.89 లక్షలు రికవరీ చేశారు. రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. ఈ మేరకు నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో విజయనగరం డీఎస్పీ ఏవీ రమణ ఆదివారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా గత ఏడాది కాలంలో ఏటీఎంల వద్ద దొంగతనాలు జరిగినట్లు 8 కేసులు నమోదయ్యాయన్నారు. అలాగే కేసు పెట్టేందుకు ముందుకురాని వారు మరో ఆరుగురు ఉన్నారని తెలిపారు.

నెల్లిమర్ల స్టేట్‌బ్యాంకు ఏటీఎం వద్ద మూడు, చీపురుపల్లిలో రెండు, గుర్లలో ఒకటి, విజయనగరంలో రెండు, సాలూరు, కొత్తవలస పరిధిలోని ఏటీఎంల వద్ద ఒక్కొక్కటి దొంగతనాలు జరిగాయి. అయితే విజయనగరం సాయినాథ్‌ కాలనీలో నివాసుముంటున్న నాగులపల్లి హరిప్రసాద్‌ ఈ దొంగతనాలకు పాల్పడినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నెల్లిమర్ల స్టేట్‌బ్యాంక్‌ ఏటీఎం వద్ద డబ్బులు విత్‌డ్రా చేసేందుకు హరిప్రసాద్‌ రాగా, ఎస్సై ఉపేంద్రరావు, కానిస్టేబుల్‌ వాసు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ 1.89 లక్షలు రికవరీ చేసుకున్నారు.  ఆ మొత్తాన్ని బాధితులకు అందజేశారు. ఖాతాదారులకు సహకరిస్తున్నట్లుగా నటించి నగదు దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడన్నారు.  

ఎస్సై, కానిస్టేబుల్‌కు అభినందన
నిందితుడిని పట్టుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన నెల్లిమర్ల ఎస్సై ఉపేంద్రరావును, కానిస్టేబుల్‌ వాసును డీఎస్పీ ఏవీ రమణ అభినందించారు. అలాగే విజయనగరం రూరల్‌ సీఐ లక్ష్మణరావు కృషి కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ వాసుకు రూ. 2 వేల నగదు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు