ఓట్లు వేయలేదంటూ దళితులపై దాడి

15 Apr, 2019 04:18 IST|Sakshi
లగడపాడులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న మహిళలు, ప్రజలు

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడులో దారుణం

అంబేడ్కర్‌ జయంతి వేడుకలు జరుపుకుంటున్న దళితులపై చంద్రబాబు సామాజికవర్గం దుశ్చర్య

కత్తులు, రాడ్లు, గొడ్డళ్లతో దళితులపై దాడులు

అర్ధరాత్రి అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళిత మహిళల ధర్నా

పెదకూరపాడు: తమకు ఓట్లు వేయలేదన్న అక్కసుతో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం నేతలు బరితెగించారు. దళితులపై ఆదివారం దాడులకు తెగబడ్డారు. పెదకూరపాడు మండలం లగడపాడులో ఈ దారుణం చోటు చేసుకుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఎస్సీలు ఆదివారం రాత్రి కాలనీలో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు సామాజికవర్గం నేతలు కత్తులు, గొడ్డళ్లు, రాడ్లతో వారిపై దాడి చేశారు. టీడీపీ నేత శివయ్యతోపాటు తదితరులు అంబేడ్కర్‌ జయంతి వేడుకలను అడ్డుకోవటమే కాకుండా రోడ్డుపై ట్రాక్టర్‌ను అడ్డుగా ఉంచి ఊర్లోకి వెళ్లనీయకుండా దౌర్జన్యానికి దిగారు. ఎంత ధైర్యం ఉంటే మాకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారంటూ రాయలేని భాషలో బూతులు తిడుతూ మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు.

ఎస్సీ కాలనీని చుట్టుముట్టి విధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలోకి వచ్చినప్పటికి వారిని సైతం లెక్కచేయకుండా బూతులు తిడుతూ దాడులకు దిగారు. దీంతో గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద దళితులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా దళిత మహిళలు మాట్లాడుతూ అంబేడ్కర్‌ జయంతిని జరుపుకోనీయకుండా తమపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఊర్లో ఉండాలా? ఊరు వదిలి వెళ్లాలా? అంటూ కన్నీరుమున్నీరయ్యారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వండుకున్న భోజనాన్ని కూడా తిననీయకుండా దాడులకు తెగబడటం దారుణమన్నారు. ఎన్నికల రెండు రోజుల ముందు నుంచి టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారని అయినా సహనంతో వాళ్లు ఎన్ని తిడుతున్నా పట్టించుకోలేదని అన్నారు. పోలీసులు సైతం టీడీపీ నేతలకే కొమ్ముకాస్తూ తమను వెళ్లిపోవాలంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. 

మరిన్ని వార్తలు