వృద్ధుడిని బంధించి.. విలువైన వజ్రం అపహరణ 

18 Jan, 2020 05:18 IST|Sakshi
దోపిడీకి గురైన డైమండ్‌ (ఎల్లో సఫైర్‌). (ఇన్‌సెట్‌లో) బాధితుడు ఖాదర్‌బాషా

కడప అర్బన్‌: కడప శివార్లలోని ఓ ఇంటిలో అద్దెకు దిగిన ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిపై దాడి చేశారు. బాధితుడిని నిర్బంధించి, అతడి వద్ద రూ.లక్షల విలువైన వజ్రాన్ని తీసుకుని పరారయ్యారు. కడపలోని చిలకలబావి వీధికి చెందిన భుట్టో ఎలక్ట్రానిక్స్‌ నిర్వాహకుడు ఆసిఫ్‌ ఆలీఖాన్‌. అతడి తండ్రి ఖాదర్‌ బాషా(60) 2009లో చెన్నైలో 113 కేరట్ల బరువున్న ఎల్లో సఫైర్‌ డైమండ్‌ను (జాతి రత్నం) రూ.25,000కు కొనుగోలు చేశాడు. ఖాదర్‌ బాషాకు నిందితుల్లో ఒకడైన షాహీద్‌ హుసేన్‌తో పరిచయం ఏర్పడింది.

షాహీద్‌ హుసేన్‌ రత్నాల వ్యాపారంలో మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. ఖాదర్‌బాషా వద్ద  విలువైన డైమండ్‌ ఉందని తెలుసుకున్నాడు. షాహీద్‌ హుసేన్‌ ఈ నెల 15న కడప శివార్లలో ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. 16న ఉదయం ఖాదర్‌బాషా నిందితులు అద్దెకు ఉంటున్న ఇంటికి వజ్రం తీసుకుని వెళ్లాడు. ఖాదర్‌బాషా నుంచి నిందితులు వజ్రాన్ని బలవంతంగా లాక్కుని పిడిగుద్దులు గుద్దారు. దుప్పటిలో కప్పి, ప్లాస్టర్‌తో చుట్టి బాత్‌రూంలో పడేశారు. కొంతసేపటికి  ఖాదర్‌బాషా స్పృహలోకి వచ్చి తన పిల్లలకు ఫోన్‌ చేశాడు. వారు వచ్చి ఖాదర్‌బాషాను రిమ్స్‌లో చేర్చారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.  

మరిన్ని వార్తలు