అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి

12 Jul, 2020 07:46 IST|Sakshi
ఘటనాస్థలం వద్ద పోలీసులు, స్థానికులు

సింధనూరులో నలుగురు దారుణ హత్య  

యువతి తండ్రి కిరాతకం  

సాక్షి, రాయచూరు: ప్రేమపెళ్లి తరువాతి పరిణామాలతో రక్తం ఏరులైంది. ఏకంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సంతోషంలో మునిగితేలాల్సిన కొత్త జంట విషాదంతో దిగ్భ్రాంతికి గురైంది. రాయచూరు జిల్లా సింధనూరులో శనివారం ఈ మారణహోమం చోటుచేసుకుంది.  ప్రేమపెళ్లి చేసుకున్న 6 నెలల తరువాత అమ్మాయి తండ్రి.. అబ్బాయి కుటుంబంపై దాడి చేసి హత్యాకాండకు పాల్పడ్డాడు.  (బిడ్డా.. నేనూ నీ వద్దకే)

ఎలా జరిగిందంటే  
వివరాలు.. సుక్కాలపేటలో ఉండే మౌనేష్‌ (25), మంజుల(22) ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. మౌనేష్‌ కుటుంబసభ్యులే పెళ్లిచేయగా అదే ఇంట్లో కాపురం పెట్టారు. అప్పటినుంచి కూతురిపై తండ్రి అంబణ్ణ (55) పట్టరాని కోపంతో ఉన్నాడు. ఈ తరుణంలో శనివారం మంజుల తండ్రి ఇంటికి వెళ్లి తనకు ఆస్తిలో రావాల్సిన వాటాను ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. తండ్రి ఇటీవల రెండో పెళ్లి చేసుకోవడంతో తనకు ఆస్తి దక్కదేమోనని మంజుల భయపడింది. అతడు ఆగ్రహం పట్టలేక మీ అంతచూస్తానని బెదిరించడంతో ఆమె ఇంటికి వచ్చేసి భర్తతో సహా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేసే పనిలో ఉంది.  (ఫెయిర్‌లో ఏముంది?)

కత్తులు కొడవళ్లతో దాడి  
అన్నట్లుగానే అంబణ్ణ  దొడ్డ ఫక్కీరప్ప(55), సన్న ఫక్కీరప్ప (60), సోమశేఖర్‌ అనే బంధువులతో కలిసి అల్లుని ఇంటికి వచ్చాడు. రావడంతోనే అల్లుని కుటుంబసభ్యులపై కత్తులు, కొడవళ్లతో విరుచుకుపడ్డారు. ఇష్టానుసారంగా పొడిచి, గొంతులు కోసి పరారయ్యారు. ఈ పాశవిక దాడిలో మౌనేష్‌ అన్న నాగరాజు(38), అక్క శ్రీదేవి (30), పెద్దన్న హనుమేష్‌ (40), తల్లి సుమిత్ర (55) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  ఇక తండ్రి వీరప్ప(65), రేవతి (20), తాయమ్మ (25) గాయాల పాలయ్యారు.  

రక్తపుమడుగులో శవాలు  
ఇంటి వద్ద రక్తపు మడుగుల్లో మృతదేహాలతో ఆ ప్రాంతం బీభత్సంగా తయారైంది. ఎటుచూసినా శవాలే కనిపించాయి. మంజుళ తండ్రి అంబణ్ణ ఇంటికి వెళ్లి ఆస్తిలో వాటా కావాలని కోరింది, దీంతో తండ్రి మౌనేష్‌ కుటుంబ సభ్యులను హత్య చేశాడని ఎస్పీ వేదమూర్తి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పట్టణ ఆస్పిత్రికి తరలించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా