ఏటీఎం చోరీకి విఫలయత్నం

7 Sep, 2019 11:30 IST|Sakshi

సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : సమిశ్రగూడెం ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) వద్ద ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగినట్లు ఎస్సై టీవీ సురేష్‌ శుక్రవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఈనెల 5వ తేదీ సాయంత్రం ఐఓబీ ఏటీఎంలో రూ.5 లక్షల నగదును పెట్టగా అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఒక వ్యక్తి చొరబడి ఏటీఎంను పగులకొట్టాడు. సీసీ కెమెరాలను గోడలవైపు తిప్పాడు. ఏటీఎంలోని నగదును దోచేయడానికి ప్రయత్నించగా లాకర్‌ తెరవకపోవడంతో దొంగ వెళ్లి పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఏటీఎంలో ఇంకా రూ.4.47 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంక్‌ మేనేజర్‌ యాలంగి రాజేష్‌ ఫోన్‌కు శుక్రవారం ఉదయం మెసేజ్‌ వచ్చింది. బ్యాంక్‌ వద్ద ఘట నాస్థలాన్ని, బ్యాంకులోని సీసీ కెమెరా పుటేజ్‌ను కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి, నిడదవోలు సీఐ కేఏ స్వామి పరిశీలించారు. ఏటీఎంలో నగదును చోరీ చేసేందుకు వచ్చిన దొంగ ముఖానికి నలుపు గుడ్డ కట్టుకుని, చేతులకు తొడుగులు వేసుకుని లోపలికి వచ్చి ఏటీఎం పగుల కొట్టినట్లు తెలుస్తోంది. కొవ్వూరు నుంచి క్లూస్‌టీం వచ్చి ఏటీఎంలోని వేలిముద్రలను సేకరించారు. బ్యాంక్‌ మేనేజర్‌ రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు