జాతరకు వెళుతూ మృత్యుఒడికి

13 Jun, 2019 13:03 IST|Sakshi
షేర్‌ ఆటోను ఢీకొన్న ఐచర్‌ వాహనం

జాతరకు వెళుతూ మృత్యుఒడికి.

షేర్‌ ఆటోను ఢీకొన్న ఐచర్‌ వాహనం

నలుగురి మృతి, తొమ్మిదిమందికి  గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి, పలమనేరు : గంగజాతరకు వెళ్తున్న వారిని మృత్యువు ఐచర్‌ వాహన రూపంలో కబళించింది. షేర్‌ ఆటోను ఐచర్‌ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బుధవారం పలమనేరు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. బైరెడ్డిపల్లె మండలం మిట్టకురప్పల్లె, కామినాయునిపల్లె, గంగవరం మండలం దండపల్లె కురప్పల్లె, కీలపట్ల కొత్తపల్లె, నాగిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వారు బంగారుపాళెం మండలం టేకుమందలో గంగజాతరకు వెళ్లడానికి   పలమనేరుకు వచ్చారు. ఇక్కడి నుంచి ఒక షేర్‌ ఆటోను మాట్లాడుకుని 14మంది బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఆంజనేయస్వామి ఆలయం వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఐచర్‌ వాహనం మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఆటోను ఢీకొంది. దీంతో ఆటో ముందరి భాగం నుజ్జు నుజ్జు అయ్యింది.

ఈ ప్రమాదంలో కురప్పల్లెకు చెందిన క్రిష్ణప్ప(53) ఆటోలోనే మృతి చెందాడు. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బంగారుపాళెం 108లో  క్షతగాత్రులకు పలమనేరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కామినాయునిపల్లె వాసి వెంకటప్ప(70), మిట్టకురప్పల్లెకు చెందిన   రెడ్డెమ్మ అలియాస్‌ దేవమ్మ(36), క్రిష్ణమ్మ(45)  కన్నుమూశారు. గాయపడిన వారిలో నాగిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు(35) అతని భార్య అమరమ్మ(28), మిట్టకురప్పల్లెకు చెందిన నందీష్‌(2), భాగ్య(15), మంగమ్మ(40), కీలపట్ల కొత్తపల్లెకు చెందిన కుమారి(30), ఆమె కుమార్తె ఇందు(8), దండపల్లె కురప్పల్లెకు చెందిన పద్మమ్మ(40), బంగారుపాళెంకు చెందిన ఆటోడ్రైవర్‌ నిషార్‌ అహ్మద్‌(37) ఉన్నారు. వీరిలో శ్రీనివాసులు, నందీష్‌ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రథమ చికిత్స అనంతరం వారిని చిత్తూరు, కుప్పంలోని ఆస్పత్రులకు తరలించారు.

కొంపముంచిన హైవే డైవర్షన్‌
ప్రమాదం జరిగిన చోట ఓ ఫ్లైఓవర్, దానికి ఇరువైపులా వన్‌వే, ఓ సర్వీసు రోడ్డుంది. ఆటోడ్రైవర్‌ ఆటో సర్వీసు రోడ్డు మీదుగా  వెళ్లి ఉన్నపక్షంలోఈ ప్రమాదం తప్పేదే. మరోవైపు వన్‌వే రోడ్డు మరమ్మతుల కారణంగా ఒకే మరో రోడ్డుకి డైవర్షన్‌ చేశారు. దీంతో వేగంగా వస్తున్న ఐచర్‌ ఆటోకు వ్యతిరేక దిశలో వెళ్లి దానిని ఢీకొంది. ఐచర్‌ డ్రైవర్‌ సింగిల్‌ రోడ్డనుకుని వాహనాన్ని వేగంగా నడపడం ప్రమాదానికి దారితీసింది.

మృతులంతా పేదలే
దండపల్లెకు చెందిన క్రిష్ణప్ప పట్టణంలోని ఓ సిమెంటు దుకాణంలో పనిచేసేవాడు. కామినేపల్లెకు చెంది న వెంకటప్ప చిన్నపాటి పనులు చేసుకునేవాడు. మిట్టకురప్పల్లెకు చెందిన రెడ్డెమ్మ అలియాస్‌ దేవమ్మ భర్త మోటార్‌ మెకానిక్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాయపడిన వారు వేర్వేరు ఊర్లయినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలకు చెందినవారే. టేకుమందలో బంధువుల ఆహ్వానం మేరకు జాతరకెళుతూ ప్రమాదం బారిన పడ్డారు. పలమనేరు ఆస్పత్రి మృతుల కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. 

మరిన్ని వార్తలు