పీడీ యాక్ట్‌ ప్రయోగించినా మారని బుద్ధి

13 Nov, 2018 09:59 IST|Sakshi
పోలీసుల అదుపులో మహేష్‌

ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న ఆటోడ్రైవర్‌ అరెస్ట్‌

పలు స్టేషన్లలో 14 కేసులు

73 తులాల బంగారం స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూనే ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి పీడీ యాక్ట్‌ ప్రయోగించినా అతడి బుద్ధి మారలేదు...జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ ఇళ్లలో చోరీలు చేస్తూ కుషాయిగూడలో మల్కాజ్‌గిరి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..ఆటోడ్రైవర్‌గా పనిచేసే మహేష్‌ మద్యానికి బానిసై చోరీల బాట పట్టాడు. తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు కుటుంబసభ్యులతో కలిసి ఊరుకు వెళుతున్నారన్న విషయం తెలుసుకొని ఆయా ఇళ్లకు కన్నం వేసేవాడు. 2017లో తొలిసారిగా జవహర్‌నగర్‌ పోలీసులకు చిక్కిన అతడిని విచారించగా తొమ్మిది ఇళ్లలో చోరీలు చేసినట్లు అంగీకరించాడు.

అతడి నుంచి 32 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించి పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. ఈ సందర్భంగా అతడికి 12 రిసీవర్‌  సొల్లెటి శంకరాచారితో జైల్లో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది జూలైలో జైలు నుంచి విడుదలైన మహేష్‌ మళ్లీ చోరీలు చేస్తూ బంగారు ఆభరణాలను శంకరాచారికి అప్పగించి సొమ్ము చేసుకునేవాడు.   జూలై నుంచి ఇప్పటివరకు 14 ఇళ్లలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అతడి కదలికలపై నిఘా ఉంచారు. సోమవారం కుషాయిగూడలోని రాధిక ఎక్స్‌ రోడ్స్‌ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో అతను కుషాయిగూడలో నాలుగు, కీసరలో నాలుగు, జవహర్‌నగర్‌లో మూడు, అల్వాల్‌లో మూడు చోరీలు చేసినట్లు అంగీకరించాడు.  

మరిన్ని వార్తలు