చిరిగిన టాప్‌ ఆధారంగా..

13 Apr, 2018 09:53 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు ,నిందితుడు జంగయ్య

బ్యాగుతో ఉడాయించినఆటోడ్రైవర్‌ అరెస్ట్‌

రూ. 3.20 లక్షలు స్వాధీనం

సీసీ కెమెరాలే కీలకం

నాగోలు: తన భార్యకు వైద్యం చేయించేందుకు నగదుతో నగరానికి వచ్చిన వ్యక్తి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.3.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. సూర్యాపేటకు చెందిన రాంచంద్రయ్య రైతు. గత నెల 25న అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు వైద్యం చేయించేందుకు రూ. 3.20 లక్షల నగదును బ్యాగులో పెట్టుకుని సూర్యాపేటలో ఎర్టిగా కారు ఎక్కారు. ఎల్‌బీనగర్‌ రింగురోడ్డులో ప్రయాణికులు దిగుతుండగా కారు డ్రైవర్‌ హడావుడిలో డబ్బులు ఉన్న రాంచంద్రయ్య బ్యాగును కిందకు దించాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రాంచంద్రయ్య, అతని భార్య కారు దిగారు.నగదుతో ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో డ్రైవర్‌ను నిలదీయగా ఎల్‌బీనగర్‌ రింగురోడ్డులోనే దింపినట్లు చెప్పడంతో వెనక్కు వచ్చి చూడగా బ్యాగ్‌ కనిపించలేదు. అదే చౌరస్తాలో ఉన్న ఆటో డ్రైవర్‌ జంగయ్య ఎవరూ లేకపోవడంతో బ్యాగ్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పట్టించిన సీసీ కెమెరాలు
సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించిన పోలీసులు బ్యాగును తీసుకెళ్తున్నట్లు కనిపించినప్పటికీ ఆటో నెంబర్‌ కనిపించకపోవడంతో ఆటోపై ఉన్న గ్రీన్‌కలర్‌ స్టిక్కర్, చినిగిన రంద్రం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఎల్‌బీనగర్‌ పరిధిలోని  45 సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించి నిందతుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 3.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందికి డీసీపీ నగదు రివార్డు అందజేశారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ డీఐ పృథ్వీదర్‌రావు, ఎస్‌ఐలు అవినాష్‌బాబు, లక్ష్మీనారాయణ, సిబ్బంది శివరాజ్, ఏఎస్‌ఐ బోస్, ఎల్లయ్య, దేవానంద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు