అమ్మా.. నాన్నేడీ..?

24 Oct, 2018 11:29 IST|Sakshi
ఆటో డ్రైవర్‌ గాదిలింగ మృతదేహం రోదిస్తున్న గాదిలింగ భార్య, కుమారుడు

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ దుర్మరణం

అనంతపురం, గుత్తి: రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ దుర్మరణం చెందాడు. అమ్మా.. నాన్న ఏడీ అని అమాయకంగా అడుగుతున్న కుమారుడిని చూసి ఆమె గుండెలవిసేలా రోదించింది. ‘చనిపోయిన మీ నాన్నను నేను ఎక్కడికి వెళ్లి తేవాలిరా’ అంటూ గుండెలకు హత్తుకుని విలపించింది. వివరాల్లోకెళ్తే.. లచ్చానపల్లికి చెందిన దానే గాదిలింగ (27) ఆటో డ్రైవర్‌. మంగళవారం గుత్తి ఆర్‌ఎస్‌ నుంచి ప్రయాణికులతో గుత్తికి బయల్దేరాడు. మార్గం మధ్యలో మేదర కాలనీ (కర్నూలు రోడ్డు) స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ఎదురుగా వెళ్తున్న బైక్‌ను తప్పించే క్రమంలో అదుపు తప్పి ఆటో బోల్తాపడింది. గాదిలింగ ఎగిరి తన ఆటో కిందనే పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ప్రమాద వార్త విని భార్య మల్లేశ్వరి, కుమారుడు ధీరజ్‌ ఆస్పత్రికి చేరుకుని మృతదేహం మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించారు. అమ్మా.. నాన్న ఎక్కడ అంటూ ఆ మూడేళ్ల బాలుడు తల్లిని అడుగుతున్న దృశ్యం చూసి అక్కడున్న వారు కన్నీరు పెట్టారు. ‘మీ నాన్న మనలను వదిలి దేవుని దగ్గరకు వెళ్లాడు నాయనా. మీ నాన్న ఇక రాడు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మల్లేశ్వరి రోదించింది. ఆమెను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ యువరాజు పరిశీలించి, కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు